హైదరాబాద్/సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ల్యాబొరేటరీలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు అగ్నికి ఆహుతి అయినట్టు అగ్నిమాపకశాఖ అధికారులు ధ్రువీకరించారు. నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు ఆనుకొని ఉన్న ఈ ల్యాబ్ మొదటి అంతస్తులో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకొన్న వస్తువులను భద్రపరిచే విభాగంలో మంటలు లేచాయి.
ఉదయం సరిగ్గా 10.20 గంటలకు అగ్నిమాపకశాఖ అధికారులకు ఫైర్కాల్ రావడంతో.. వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పడం ప్రారంభించారు. దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక రోబో ఫైరింజన్, ఐదు అగ్నిమాపక వాహనాల ద్వారా మంటలను ఆర్పారు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, అగ్నిమాపక శాఖ డీఎఫ్‌వో శ్రీరామ్‌దాస్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

ఈ అగ్నిప్రమాదంలో పలు కీలక కేసులకు సంబంధించిన 40-50 వరకూ కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. వీటితోపాటు తెలుగు రాష్ర్టాల్లో కీలకంగా భావిస్తున్న పలు కేసులకు సంబంధించిన పేపర్ ఎవిడెన్స్‌లు కూడా కాలి బూడిదయ్యాయని అంటున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను నేరస్తులుగా తేల్చిన అనేక సాక్ష్యాధారాలు సైతం ఆ మంటల్లోనే కాలిపోయాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివిధ కేసులకు సంబంధించి అక్కడికి తీసుకొచ్చిన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఇతర ఆధారాలు, సెల్ఫోన్లు, కొన్ని రేప్ కేసుల్లో సేకరించే ఆధారాలు, డీఎన్ఏలు వంటివి కూడా కాలిపోయాయని అంటున్నారు. ఇక కొన్ని కోట్ల రూపాయల విలువైన ఫోరెన్సిక్ సైన్స్ యంత్ర సామగ్రి కూడా కాలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాలిపోయిన వాటిని రీక్రియేట్ చేయలేమని, వాటిని మళ్లీ సేకరించడం పోలీసులకూ పెద్ద సవాల్ అని ఫోరెన్సిక్ సిబ్బంది చెప్తున్నారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. షార్ట్ సర్యూట్ కారణంగానే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంటలు చెలరేగి ఉంటాయని పేర్కొన్నారు. ఉదయం 10.20 తర్వాత సమాచారం రావడంతో హుటాహుటిన వచ్చామని చెప్పారు. నేర పరిశోధనకు సంబంధించిన పలు ఫైళ్లు, సాక్ష్యాధారాలు, ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోనే పలు కీలక కేసులకు సంబంధించిన కంప్యూటర్స్ ఉంటాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఏమి కాలిపోయాయో స్పష్టత లేదని అన్నారు.
ఐదు ఫైరింజన్ల సహాయంతో పూర్తిగా మంటలను అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వార్డ్బాయ్ కృష్ణను 108 ద్వారా హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వార్డ్బాయ్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడని అంటున్నారు. మొదటి అంతస్తులో ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు మంటలు గమనించి సురక్షితంగా బయటికి వచ్చారని, ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని చెప్పారు.
ఎఫ్ఎస్ఎల్లో ప్రమాదం జరిగిందని కాల్ రావడంతోనే ఇక్కడికి చేరుకున్నామని డీఎఫ్‌వో శ్రీరామ్‌దాస్ చెప్పారు. మొదటి అంతస్తులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎంతో విలువైన హార్డ్‌డిస్క్‌లు, కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. ఈ భవనంలోకి వెళ్లేందుకు అవకాశాలు సులభతరంగా లేవని, పోర్టికో నుంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చి అనంతరం లోపలికి వెళ్లామని తెలిపారు. అప్పటికే దట్టమైన పొగ ఆవహించడంతో ఫైర్ రెస్క్యూ కష్టతరంగా మారిందని చెప్పారు. దాదాపు రెండున్నర గంటలలో పూర్తిస్థాయిలో మంటలను అదుపులోకి తీసుకువచ్చామని చెప్పారు. కెమికల్ ల్యాబ్ మెటీరియల్ అంతా రెండో అంతస్తులో ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని అన్నారు. మొదటి అంతస్తులో సున్నితమైన ప్లాస్టిక్ వస్తువులు కాలి బూడిదయ్యాయని తెలిపారు. రెండో అంతస్తులో ఉన్న కెమికల్ ల్యాబ్‌కు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని చెప్పారు.
ఫైర్ కాల్ వచ్చిన ఐదు నిమిషాల్లోనే తమ సిబ్బంది స్పాట్‌కు వచ్చారని అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్‌సింగ్‌మాన్ చెప్పారు. ప్రమాద స్థలం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇది పాత భవనం అని.. కార్యాలయంలో ఉన్న ఫోరెన్సిక్ సిబ్బంది కూడా తమకు అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ (మంటలను ఆర్పే పరికరాలు)తో ప్రయత్నించినా ఉపయోగం లేకపోయిందని అన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. కంప్యూటర్లు, ఫర్నిచర్, ప్రింటర్లు కాలిపోయినట్టు గమించానని తెలిపారు. అన్నింటిపై పరీక్షిస్తున్నామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు.