Revanth Cabinet | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు క్యూ కడుతున్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఆదిలాబాద్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లగా, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటికే ఢిల్లీలో తిష్ట వేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ బయలుదేరారు.
క్యాబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి, ఎవరికి ఉద్వాసన పలకాలి అన్నదానిపై అధిష్ఠానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అయినప్పటికీ నేతలు తమ వంతు చివరి ప్రయత్నంగా ఢిల్లీ వెళ్లి మంతనాలు సాగిస్తున్నారు. క్యాబినెట్ రేస్‌లో ప్రధానంగా సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మీర్అలీఖాన్, బాలునాయక్‌లు ఉన్నట్టు సమాచారం. మరోవైపు మాదిగ, లంబాడా, బీసీ వర్గాల నుంచి మంత్రి పదవులను ఆశించేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం దీనిని ఎలా పరిష్కరిస్తుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.
క్యాబినెట్ విస్తరణతోపాటు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కార్పొరేషన్ పదవులు, పీసీసీ, డీసీసీ పదవులకు కూడా ఎంపిక జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో వాటిని ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు సైతం ఢిల్లీ బాటపట్టారు. పదేండ్లు పార్టీ కోసం కష్టనష్టాలను ఎదుర్కొని జెండా మోసిన తమకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. పనిలోపనిగా పలువురు డీసీసీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలపై అధిష్ఠానానికి ఫిర్యాదు కూడా చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే పలువులు డీసీసీ అధ్యక్షులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, యాదాద్రి-భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఒకే వ్యక్తికి, ఒకే కుటుంబానికి రెండు పదవులపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.