Budget | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రెండు లక్షల ఉద్యోగాల భర్తీ విషయమే లేదు.. నిరుద్యోగ యువతకు నెలనెలా నిరుద్యోగ భృతి ప్రస్తావనే రాలేదు.. బీఆర్ఎస్ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధిలో కొంతైనా కాంగ్రెస్‌కు లేదని నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై భగ్గుమంటున్నారు. పైరెండు అంశాలను బడ్జెట్లో చేరుస్తారని భావించిన నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశనే మిగిల్చింది. శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో ఎప్పటిలాగే తన నైజాన్ని బయటపెట్టుకుందని పలువురు పెదవి విరుస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిని ప్రధాన అజెండాగా చేసుకుని ముందుకెళ్లిన ఆ పార్టీ.. తర్వాత ఆచరణలో మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. బీఆర్ఎస్ సర్కారు గత బడ్జెట్ సమయంలో భవిష్యత్తులో భర్తీ చేయబోయే ఉద్యోగులకు ప్రతినెలా వేతనాల బడ్జెట్‌నూ ప్రవేశపెట్టి తన చిత్తశుద్ధిని చాటుకున్నది. ఉద్యోగాల భర్తీ చేసిన తర్వాత కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య, వారికి ప్రతినెలా ఇవ్వబోయే వేతనాలను అంచనా వేసి వెయ్యి కోట్లను నాటి బడ్జెట్లో ప్రతిపాదించింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీతో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ ఎంతో ముందుచూపుతో ఉంటుందని అందరూ ఆలోచించారు. అదంతా ఒట్టిదేనని తేలింది. దీంతో నిరుద్యోగుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తమవుతున్నది.