మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నం. పాతికేండ్ల కిందటి రోజుల్ని మళ్లీ తెస్తరనుకోలేదు. నాడు కరెంటు చార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బషీర్బాగ్ చౌరస్తాలో కాల్పులకు తెగబడింది. ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చంద్రబాబు రైతు దమన పాలనకు నిదర్శనం ఆ ఘటన. ఆ నెత్తుటి ఘటనకు రేపటితో 25 ఏండ్లు!
కేసీఆర్ పదేండ్ల పాలనను మినహాయిస్తే.. టీడీపీ, కాంగ్రెస్ పాలనలో రైతాంగం కంటిమీద కునుకులేకుండా భయం భయంగా కాలం గడిపింది. రైతు ఆత్మహత్యలు, కాల్పులు, లాఠీచార్జీలు జరగని సీజన్లేదు. తెలుగుదేశం స్కూల్లో, కాంగ్రెస్ కాలేజీలో చదువుకున్నానని గర్వంగా చెప్పుకునే సీఎం రేవంత్.. తన పాలనలో ఆ రెండు పార్టీల చీకటి రోజులను తెలంగాణ రైతుకు మళ్లీ చవిచూపిస్తున్నారు. అన్నట్టే ఆనాటి రోజులు తెచ్చారు!
పథకాలు పక్కకెళ్లిపోయినయ్. రుణమాఫీ పూర్తికాదు. భరోసా రాదు. బోనస్ లేదు! కరెంటియ్యరు.. చెరువులు నింపరు! ఆఖరికి యూరియానూ అందివ్వలేరు! కల్తీ విత్తనాలను అరికట్టలేరు.. ఆత్మహత్యల్ని ఆపలేరు! రైతుకు కేసీఆర్ ఇచ్చిన ఏ సపోర్ట్నూ వందశాతం ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదు. అయితే కోత! లేదంటే కొరత! అదీ కాదంటే వాత!! ఇన్ని సమస్యల సుడిగుండంలోనూ.. హాలాహలాన్ని దిగమింగి, హలాన్ని నడిపించిండు తెలంగాణ రైతు. ఇన్ని అష్టకష్టాల మధ్య కూడా అత్యధిక సాగుకు సిద్ధమైండు. ఆ అన్నదాతను ఆదుకోవడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.