తెలంగాణ ఏర్పడి పుష్కరం దాటినా ప్రతీప శక్తుల పగ చల్లారనట్టే కనిపిస్తున్నది. పరాయి శక్తులు కుట్రల కత్తులు నూరుతూనే ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువైపు చూసేందుకు జంకిన పొరుగు పార్టీలు.. ఇప్పుడు పచ్చని రాష్ట్రంపై మళ్లీ విషం చిమ్ముతున్నాయి. శక్తిహీన కాంగ్రెస్ అధికారంలో ఉండటం, అనుకూలమైన పాలకుడు అహ్వానిస్తుండటంతో కుతంత్రాల యంత్రాలు మళ్లీ పనిమొదలుపెట్టాయి. నీటిదోపిడీకి మాయదారి పన్నాగాలు, మహానాడులో వెకిలి మాటలు, ఇక్కడి ఉద్యమకారులపై అక్రమ కేసులు, తెలంగాణ జర్నలిస్టులపై బూతులతో దాడులు, హైదరాబాద్ నడిబొడ్డున మళ్లీ వెలుస్తున్న ఆంధ్రా నేతల విగ్రహాలు, రాష్ర్టావతరణ దినోత్సవం వేళ రెచ్చగొట్టేందుకు పవన్‌కల్యాణ్ సభకు పన్నాగం.. ఇవన్నీ అవే సంకేతమిస్తున్నాయి! అస్తిత్వాన్ని చిదిమేలా ఆధిపత్యం అహంకరిస్తే.. మరో సమరం తప్పదు! రాష్ర్టావతరణ సంబురాల వేళ.. తేల్చుకోమంటున్నది తెలంగాణ!
వరంగల్, జూన్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పుష్కరకాలంగా సంబురంగా ఉన్న తెలంగాణపై మళ్లీ అజమాయిషీ చేసేలా పరిస్థితులు మారుతున్నయా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణించుకోలేని శక్తులు మళ్లీ ఈ నేలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాయా? ఆత్మగౌరవంతో రెపరెపలాడిన తెలంగాణ అస్తిత్వం తిరిగి అలజడికి గురవుతున్నాదా? తెలంగాణ ప్రజల్లో ఆవిర్భావ సంబురం లేకుండా చేయాలనే ఆంధ్రా నేత పవన్‌కల్యాణ్ హైదరాబాద్ ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’కు సిద్ధమవడం ఆధిపత్య కుట్రలో భాగమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 11రోజులు ఉపవాస దీక్ష చేసిన పవన్‌కు తెలంగాణలో ఏం పని? అసలు ఆయన అధికారంలో ఉన్న ఆంధ్రపదేశ్‌లో ఆ రాష్ట్ర నిర్మాణం కోసం ఏ పనైనా చేసుకో.. కానీ, తెలంగాణ ఏర్పాటునే జీర్ణించుకోలేని నాయకుడికి ఇక్కడేం పని?
అని తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ఏ ప్రతీపశక్తులపై తెలంగాణ అలుపెరుగని పోరు సలిపి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నదో.. ఇప్పుడు తిరిగి అవే శక్తులు మళ్లీ కుట్రల కత్తులు దూస్తూ ఆత్మగౌరవం, అస్తిత్వంపై దాడి చేసి వెక్కిరిస్తున్న వేళ తెలంగాణ సమాజం అలజడికి లోనవుతున్నది. మరోవైపు సర్కార్ ప్రజావ్యతిరేక, నిరంకుశ పాలనలో సంతోషానికి దూరమైన రైతులు, విద్యార్థులు, ఆటో కార్మికులు, మహిళలు.. ఇలా ఒక్కో వర్గం ఆగ్రహానికి గురవుతుది. ప్రశ్నిస్తే కేసులు, వేధింపులు, బెదిరింపులు అంటూ టార్గెట్ చేయడాన్ని తిప్పికొట్టేందుకు ఆందోళనబాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమరం మిగిలే ఉన్నదని.. అప్రమత్తతే అసలైన ఆయుధం అని గుర్తుచేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురం లేకుండా చేయాలన్నదే కుట్రదారుల ఎత్తుగడగా కనిపిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ను నిర్వహిస్తామని ప్రకటించడంపై భగ్గుమంటున్నారు. తెలంగాణ బిడ్డలైన ప్రొఫెసర్ కే నాగేశ్వర్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి వంటి వారిపై ఆంధ్రా మూకలు పేట్రేగుతున్న సందర్భంలో ఈ సభ పెట్టడంలోని ఆంతర్యం ఏమిటి? పవన్‌కల్యాణ్ అనే నటుడిని ఆడిస్తున్న దర్శకుడు ఎవరు? అనే విషయంలో తమకు స్పష్టమైన అవగాహన ఉన్నదని తెలంగాణ సమాజం తేల్చిచెప్తున్నది. మరోవైపు తెలంగాణపై తిరిగి కుట్రలు వేయి తలల విషనాగులై బుసలుకొడుతున్నాయని ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ‘తెలంగాణ’ అన్న పదాన్నే నిషేధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, మంగళగిరి సాక్షిగా మరోసారి తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదని చెప్పించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడం.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికిన శిష్యుడు హైదరాబాద్ అభివృద్ధి ప్రదాతగా గురువును కీర్తించటం, ఎన్టీయార్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయటం అంటే తెలంగాణలో తిరిగి టీడీపీకి జీవం పోయడమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్‌లో వరుసబెట్టి రోశయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ వెళ్లటం అంటే తన భవిషత్ కార్యాచరణను బహిరంగంగా వెల్లడించే ఘటనలని ఉదహరిస్తున్నారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా జలాల దోపిడీకి యథేచ్ఛగా పాల్పడుతున్న చంద్రబాబుకు తెలంగాణను దాసోహం చేస్తున్నారనే విమర్శ ఉండనే ఉన్నది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు అప్రమత్తంగా ఉండమని తెలంగాణను హెచ్చరిస్తుండటం గమనార్హం.
ఇచ్చిన మాటను గుర్తుచేస్తే కేసు అన్నట్టుగా రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కార్ బెదిరింపులకు గురిచేస్తున్నది. రెండున్నరేండ్లుగా వానకాలం, యాసంగి సీజన్ ఏదైనా కష్టమొకటే అనే రీతిలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మళ్లీ కాలం నెత్తిమీదికొచ్చింది. పంట నీటి కోసం, పంట పెట్టుబడి కోసం, పంటకు అవసరమైన ఎరువు కోసం రైతులు కొండకు ఎదురుచూసినట్టు చూడాల్సి వస్తున్నది. రైతుభరోసా ఎకరానికి రూ.15వేలు ఏమైనయ్? అని, కౌలు రైతులు తమ హామీ అమలు ఏదీ? కాంగ్రెస్ సర్కార్‌ను రైతాంగం ప్రశ్నిస్తున్నది.
రాష్ట్రంలో ఒక్క రైతులే కాదు అన్ని వర్గాలు అసంతృప్తి. ఏ వర్గంలోనూ తెలంగాణ ఆవిర్భావ సంబురం కనిపించని వాతావరణమే నెలకొన్నది. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా హెల్త్‌స్కీమ్ కోతలెందుకని ఉద్యోగులు సర్కార్‌పై రగిలిపోతున్నారు. పీఆర్సీ ఎప్పుడని మండిపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు మా విలీనం ఎప్పుడని రగిలిపోతున్నారు. ఆటోడ్రైవర్లు ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన నెలకు రూ.1,000 ఏవీ? అని, మహిళలు తమకు ఇచ్చిన నెలకు రూ.2,500 హామీ ఏది? అని, విద్యార్థినులు స్కూటీ ఏది? ఇలా అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపై ఎదురుచూస్తున్నాయి.