Caste Survey | హైదరాబాద్, నవంబర్20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పట్టణంలో సరిగా జరగడంలేదని, నగరవాసుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసా వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్వే డేటా వచ్చిన తర్వాతే, అధ్యయనం చేసి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లను కల్పిస్తూ నివేదికను అందిస్తామని స్పష్టంచేశారు. మాసాబ్ ట్యాంక్‌లోని కమిషన్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, కుల, ప్రజాసంఘాలు, మేధావులతో భేటీ అయ్యారు.
వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన తమ డెడికేటెడ్ కమిషన్ బృందం ఇప్పటివరకు ఐదు జిల్లాల్లో (ఉమ్మడి జిల్లాలు) పర్యటించి అభిప్రాయ సేకరణ పూర్తిచేసిందని తెలిపారు. గురువారం వరంగల్ కలెక్టరేట్లో విచారణ కొనసాగనుందని వెల్లడించారు. 90,56,383 ఇండ్లలో పూర్తి సర్వే 78 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇండ్లు ఉండగా బుధవారం వరకు 90,56,383 ఇండ్లలో సర్వే పూర్తిచేసినట్టు వెల్లడించారు.