గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 17:34:15

రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: నిజామాబాద్‌ కలెక్టర్‌

రైల్వేస్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: నిజామాబాద్‌ కలెక్టర్‌

నిజామాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ, వేలాది మందిని కబళించిన కరోనావైరస్‌(కోవిద్‌-19) పట్ల అన్ని దేశాలు హై అలర్ట్‌ ప్రకటించాయి. భారత్‌లోనూ ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  అత్యంత జాగ్రత్త వహిస్తున్నాయి. కరోనాను నిలువరించే క్రమంలో రేపు దేశవ్యాప్తంగా జనతాకర్ప్యూ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. వైరస్‌ను కట్టడి చేసేందుకు కృషిచేస్తోంది. 

ఇవాళ నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌.. టికెట్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి ప్రయాణికులు క్యూలైన్లో దూరం పాటించాలని సూచించారు. రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫారమ్స్‌, రైలు బోగీల్లో శుభ్రత కొరకు శానిటైజేషన్‌ చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తే, వైరస్‌ను దరిచేయనీయకుండా చేయనీయవచ్చిని ఈ సందర్భంగా తెలిపారు. జనం సమూహాలుగా ఏర్పడకుండా.. ఎవరికి వారే స్వీయ సంరక్షణ పాటించాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు. 

ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ నారాయణ రెడ్డితో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఆర్డీవో వెంకటయ్య, స్టేషన్‌ మాస్టర్‌ రవికుమార్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ సాగర్‌ తదితరులు ఉన్నారు.


logo