హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : భాషాపండితులు, పీఈటీల అప్‌గ్రేడేషన్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో వారి ఇరవై ఏండ్ల ఎదురుచూపులకు తెరదించినట్టయింది. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్)పోస్టులను గ్రేడ్ -2 పండితులకే, పీడీ పోస్టులను పీఈటీలకే కేటాయించాలన్న రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్‌చేస్తూ దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు శుక్రవారం డిస్మిస్ చేసింది. దీంతో స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్), ఫిజికల్ డైరెక్టర్ పదోన్నతులు కల్పించేందుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో తాజాగా చేపట్టిన టీచర్ల పదోన్నతుల్లో 8,156 మంది భాషాపండితులకు, 1,847 పీఈటీలకు పదోన్నతులు దక్కుతాయి. ఈ తీర్పుపట్ల భాషాపండితులు, పీఈటీలు హర్షం వ్యక్తంచేశారు.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భాషాపండితులను అప్గ్రేడ్చేస్తామని అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, భాషాపండితులు, పీఈటీలను అప్‌గ్రేడేషన్ చేస్తూ జీవోలను జారీచేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 2, 3, 9, 10లను అప్పటి సర్కారు జారీచేసింది. సర్వీస్‌రూల్స్‌ను సైతం జారీచేసింది. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టుకెళ్లగా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇది న్యాయబద్ధంకాదని తీర్పు ఇచ్చింది. సెకండరీ గ్రేడ్ టీచర్లకు కూడా పదోన్నతులు కల్పించాలని సింగిల్‌బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ భాషాపండితులు హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
డివిజన్ బెంచ్ భాషాపండితులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గ్రేడ్ -1 పోస్టులను గ్రేడ్ -2 వారికి పదోన్నతులు కల్పించి నింపాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై కొంత మంది టీచర్లు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసును డిస్మిస్ చేసి, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. దీంతో తాజాగా కొనసాగుతున్న బదిలీలు, పదోన్నతుల్లో మల్టీ జోన్ -1, 2లతో భాషాపండితులకు స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్), పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు పొందేందుకు వీలుకలిగింది.
భాషాపండితుల సుదీర్ఘ న్యాయ పోరాటం, కల నేడు ఫలించింది. ఇది పాఠశాల విద్యలో భాషాబోధనకు మంచిరోజుగా అభివర్ణించవచ్చు. నాడు ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ రాష్ట్రంలోని భాషాపండితులకు తీపికబురందించారు. భాషాప్రేమికుడైన అప్పటి సీఎం వల్లే ఇది సాధ్యమైంది. భాషాపండితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద ఉపకారమిది. తన విజ్ఞప్తి మేరకు ఇంతటి చొరవ తీసుకుని భాషాపండితులకు న్యాయం చేసిన కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం (ఆర్‌యూపీపీటీఎస్) స్వాగతిస్తున్నాం. తమ 20 ఏండ్ల కల సాకారంకాబోతున్నది. ఈ కీలక తీర్పు వెలువడేందుకు సహకరించిన అధికారులు, న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు.
– జగదీశ్, నర్సిములు, ఆర్‌యూపీపీ టీఎస్