హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం సాయంత్రం వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. శనివారం భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని, ఎల్లో అలర్ట్ జారీ చేశామని ఐఎండీ అధికారులు వెల్లడించారు.