ఆదిలాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రిన్సిపాల్ వేధింపులకు గురిచేస్తున్నారని, ఆమె నుంచి రక్షించాలంటూ ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. జైనథ్ మండలానికి చెందిన బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న మావలలో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్నది. ఇందులో పదో తరగతి చదువుకుంటున్న 46 మంది విద్యార్థులు ఉదయం 3గంటల సమయంలో స్కూల్ గోడదూకి 4కిలోమీటర్ల దూరం నడిచి ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు ఇటీవల ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గంగన్న బదిలీపై వెళ్లగా.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి సంగీత ఇక్కడికి వచ్చారని, పాఠశాలలో భోజనం, కరెంటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని అడిగితే ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని, టీసీలు ఇస్తూ, బ్యాడ్ కండక్ట్ అని తమ సర్టిఫికెట్లపై రాస్తా అంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. వేధింపులు భరించలేక ఐదుగురు పిల్లలు ఆత్మహత్య ఆలోచన చేసినట్టు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు 4 గంటలు పోలీస్‌స్టేషన్‌లో ఉండగా.. పోలీసులు కలెక్టర్, ఎస్పీకి సమాచారం ఇచ్చారు. టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు విద్యార్థులకు నచ్చజెప్పి వారికి టిఫిన్ పెట్టించి బస్సుల్లో స్కూల్‌కు పంపించారు.