జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ రాజేందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఉదండా పూర్ గ్రామానికి చెందిన శివకుమార్(14)అనే విద్యార్థి శుక్రవారం తన బాబాయి, మరి కొందరు పిల్లల తో కలిసి గ్రామ శివారులో ఉదండా పూర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా తవ్విన గుంత లో ఈత కొట్టేందుకు వెళ్లాడు. నీటి గుంతలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. వెంటనే అక్కడున్న వారు గమనించి అతని కోసం గాలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఈతగాళ్ల సాయంతో బాలుడిని బయటకు తీశారు.
కొన ఊపిరితో ఉన్న బాలుడిని చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో జడ్చర్ల దవాఖానకు తరలించారు. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. బాలుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.