ములుగు, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మేడారం తల్లుల ఆలయ, గద్దెల అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాతి కట్టడాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఇటీవల జరిగిన మేడారం మహా జాతరలో తల్లులను రెండు కోట్లకుపైగా భక్తులు దర్శించుకోగా ఆలయ ప్రాంగణంలో ఉన్న రాతి కట్టడాలు విరిగిపోయాయి. భక్తుల తాకిడికి కట్టడాలు నేలకొరిగిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సమ్మక్క-సారలమ్మ దర్శనం అనంతరం సమ్మక్క గద్దె చుట్టూ వెదురు బొంగు వంటి ఆకారంతో రాతి కట్టడాలు ఏర్పాటు చేయగా వాటిపై దిమ్మెలను ఏర్పాటు చేయలేదు.

జాతర సమయంలో భక్తులు కొబ్బరి, బెల్లం తల్లి గద్దెలపై విసిరి వేయడంతోపాటు భక్తుల తాకిడికి వెదురు బొంగు రాతి కట్టడాలతోపాటు మరికొన్ని రాతి కట్టడాలు విరిగిపోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేక రాయిని ఆళ్లగడ్డ నుంచి తెప్పించి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం కట్టించామని ప్రభుత్వం చెప్పిన గొప్పలు నాలుగు రోజుల్లోనే నాసిరకంగా మారాయి. నిర్మాణ పనుల తీరు ప్రస్తుతం అభాసుపాలుగా మారింది. నిర్మాణ పనులను చేపట్టిన సదరు కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడంతోనే ఇలా జరిగిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.