హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కార్ తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 57శాతం అప్పులు సమీకరించింది. నిర్దేశిత వార్షిక రుణ సమీకరణలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో మాత్రం చతికిలపడుతున్నది. రెవెన్యూ ఆదాయం, సొంత పన్నుల రాబడిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు తీసికట్టుగా తయారైంది. ఇదే విషయాన్ని బుధవారం రాత్రి వెలువడిన జూలై నెల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక బట్టబయలు చేసింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న రుణ సమీకరణలో ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే 57శాతం పూర్తి చేసింది. మొత్తం రూ.58,458.71 కోట్ల మేర అప్పులు సేకరించాలని వార్షిక బడ్జెట్లో అంచనా వేయగా, జూలై నాటికే రూ.33,729.98 కోట్ల రుణాలను సేకరించింది. అంటే ఏడాది వ్యవధి కోసం అనుమతించిన రుణ పరిమితిలో సగానికి మించి అప్పు సంవత్సరంలో మూడో వంతు కూడా పూర్తికాకముందే సమీకరించినట్టయ్యింది. సాధారణంగా రుణాలను అభివృద్ధి, మూలధన వ్యయాలకు వినియోగించాల్సి ఉంటుంది. కానీ, సొంత ఆదాయ వనరులు బలోపేతం చేసుకోకుండా అప్పులపై ఆధారపడితే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే ప్రశ్న కాగ్ గణాంకాలతో తలెత్తుతున్నది.
బీఆర్ఎస్ హయాంలో 25.21%.. ఇప్పుడు 24.72 శాతమే
రెవెన్యూ ఆదాయ సమీకరణలో గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత పాలనలో వెనుకబాటు నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్ర రెవెన్యూ ఆదాయం వార్షిక అంచనాలో 25.21 శాతం నమోదైంది. రేవంత్ సరార్ హయాంలో అదే కాలానికి రెవెన్యూ ఆదాయం వార్షిక అంచనాలో 24.72 శాతం మాత్రమే వచ్చింది. అంటే గతంతో పోలిస్తే 0.49 శాతం పాయింట్ల తగ్గుదల నమోదైంది. నాలుగు నెలల్లోనే దాదాపు పావు వంతు వార్షిక రెవెన్యూ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన సమయంలోనే ఈ వెనుకబాటు కనిపించడం ఆర్థిక నిర్వహణపై అనుమానాలను రేకెత్తిస్తున్నది.
సొంత పన్నుల రాబడిలోనూ వెనుకబాటే
సొంత పన్నుల రాబడి విషయంలో వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తున్నది. 2022-23లో ఏప్రిల్-జూలై మధ్య రాష్ట్ర సొంత పన్నుల రాబడి వార్షిక అంచనాలో 31శాతం నమోదైంది. ప్రస్తుత రేవంత్ పాలనలో 29.22శాతానికే పరిమితమైంది. అంటే 1.78 శాతం పాయింట్ల వెనుకబాటు నమోదైంది. రెవెన్యూ ఆదాయంలో 0.49 శాతం పాయింట్ల తగ్గుదలతో పోలిస్తే సొంత పన్నుల రాబడిలో తగ్గుదల మరింత గణనీయంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
లోపించిన ఆర్థిక స్థిరత్వం
ప్రభుత్వ ఆర్థిక ఆరోగ్యానికి రెవెన్యూ ఆదాయం, ముఖ్యంగా సొంత పన్నుల ఆదాయమే కొలమానంగా చెప్తారు. రాష్ర్టానికి ఇతర మార్గాల ద్వారా వచ్చే నిధులపై ఆధారపడటంతోపాటు, తన పరిధిలో పన్నుల వసూళ్లు పెంచుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. అయితే నాలుగు నెలల గణాంకాల్లోనే సొంత పన్నుల రాబడి గతంతో పోలిస్తే తగ్గడం, అదే సమయంలో రుణసమీకరణ 57శాతానికి చేరడం ఆర్థిక నిర్వహణ విధానంపై విమర్శలకు అవకాశం కల్పిస్తున్నది. ఆదాయ అంచనాల్లో వేగం తగ్గుతుంటే అప్పుల సమీకరణలో మాత్రం వేగం పెరుగుతున్నది. ఒకవైపు నాలుగు నెలల్లోనే వార్షిక రుణ సమీకరణలో 57శాతం పూర్తికావడం, మరోవైపు రెవెన్యూ ఆదాయం 24.72 శాతం, సొంత పన్నుల రాబడి 29.22 శాతానికే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తున్నది.

Ppp