Pakistan : పాకిస్తాన్లో మైనారిటీలపై వేధింపులు, దాడులు సాధారణమయ్యాయి. ముఖ్యంగా హిందూ యువతుల్ని కిడ్నాప్ చేసి, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. తాజాగా, అలాంటి ఒక ఘటనే ఇటీవల పాకిస్తాన్లో జరిగింది. 13, 14 ఏళ్ల వయసున్న హిందూ అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి, బలవంతపు మత మార్పిడి చేశారు. అనంతరం పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 9న పాకిస్తాన్, సింధ్ ప్రాంతంలోని తాండో అల్లహ్యార్ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉంటారు.
కచ్చి కోల్హి అనే హిందూ మతానికి చెందిన 13, 14 ఏళ్ల బాలికలను అంజాద్ సోలాంగి, మన్సూర్ సోలాంగి అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం స్థానిక జిల్లా కోర్టును ఆశ్రయించింది. బాధిత బాలికలు ఇద్దరూ కోర్టుకు హాజరయ్యారు. తమను కిడ్నాప్ చేసి, మత మార్పిడి చేసి, బలవంతంగా పెళ్లి చేసుకున్నారని ఆ బాలికలు కోర్టుకు తెలిపారు. తమను తల్లిదండ్రులతోపాటు ఇంటికి పంపించాలని బాలికలు కోర్టును వేడుకున్నారు.
అయినప్పటికీ కోర్టు కరుణించలేదు. బాలికలను తమ తల్లిదండ్రులు ఉండే ఇంటికి పంపించేందుకు కోర్టు నిరాకరించింది. బాలికలను సురక్షిత ప్రదేశానికి మాత్రమే తరలించాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో బాలికలు న్యాయమూర్తిని ఎంతగా వేడుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా సరైన స్పందన రాలేదు. ఈ ఘటన అక్కడి హిందువుల విషయంలో పాక్ ముస్లిం ప్రజలు, వ్యవస్థలు ఎలా ప్రవర్తిస్తున్నాయో తెలియజేస్తుంది. పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికాకు చెందిన సింధి హక్కుల సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
సింధ్ జిల్లాలో గడిచిన పది రోజుల్లో ఆరుగురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి, మత మార్పిడులకు పాల్పడ్డారని ఈ సంస్థ తెలిపింది. ఇటువంటి ఘటనలు పాకిస్తాన్లో సర్వసాధారణమైపోయాయని వెల్లడించింది.