వేల్పూర్, మార్చి 4: జీఎస్డీపీ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని తన నివాసంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ పల్లెలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తున్నాయని చెప్పారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఆర్థిక క్రమశిక్షణ కారణంగా తెలంగాణ జీఎస్డీపీ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని పునద్ఘాటించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో రూ.5 లక్షల కోట్లు ఉంటే నేడు రూ.11లక్షల కోట్లకు వృద్ధి చెందిందని వెల్లడించారు. పౌరుల తలసరి ఆదాయం 2014లో రూ.1.28 లక్షలు ఉంటే నేడు రూ.2.78 లక్షలకు పెరిగిందని స్పష్టంచేశారు. అభివృద్దిలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉన్నదని ఓ పక్క కేంద్రమే చెప్తుంటే ఇక్కడి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుల వృత్తులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రైతులకు పంట పెట్టుపడి సహాయం, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, సాగు నీరు ఇస్తుండటంతో తెలంగాణ పల్లెలు ఆర్థికంగా బలోపేతం అయ్యాయని చెప్పారు. కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ తరువాత అభివృద్ధి ఎలా ఉందో ప్రజలు, రైతులు ఆలోచించాలని కోరారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.