హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : భాషాపండితుల అప్ పూర్తిచేయాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్ఎల్టీఏ నేతలు మంగళవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఒకట్రెండు రోజుల్లోనే హైకోర్టు తీర్పు వస్తుందని, ఆ తర్వాత పదోన్నతులు కల్పిస్తామని మంత్రి తమకు హామీ ఇచ్చినట్టు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి గౌరిశంకర్రావులు తెలిపారు.
ఇక మాడల్ స్కూల్ టీచర్ల బదిలీలను కూడా చేపట్టాలని పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పారదర్శకంగా, క్రమపద్ధతిలో అతి తక్కువ సమయంలో ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం) బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయడం పట్ల టీఎస్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం నేతలు రాజభాను చంద్రప్రకాశ్, రాజగంగారెడ్డి, తుకారం మంత్రి సబితను కలిసి ధన్యవాదాలు తెలిపారు.