హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా మలాజిగిరి మండలం లోతుకుంట భూముల్లోకి వెళ్లరాదని రాష్ట్ర హైకోర్టు హైడ్రాకు తేల్చిచెప్పింది. ఆ భూములకు సంబంధించి స్టేటస్కో ఉత్తర్వులు జారీచేస్తూ.. అధికారుల మాటలతోనే చర్యలు తీసుకుంటారా.. రికార్డులు చూడరా.. అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమికి సంబంధించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. వివాదాస్పద భూమిలో హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టరాదని, అకడ యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ప్రభుత్వ భూములను రక్షించడం హైడ్రా బాధ్యతే అయినా.. భూమి హకులు, వివాదాలు, కోర్టు ఉత్తర్వులపై పూర్తి వివరాలు పరిశీలించకుండా చర్యలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించింది. శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషనర్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపి.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను బాధ్యతల నుంచి నుంచి తప్పించి, ఆయన స్థానంలో సమర్థుడైన అధికారిని నియమించాలని కోర్టు ఇంతకుముందు ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి సూచించింది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగనాథ్ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలను జారీచేసింది. రంగనాథ్ తరఫున సీనియర్ న్యాయవాది, హిమాచల్‌ప్రదేశ్ మాజీ చీఫ్ రాజీవ్శక్దర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ భూములను రక్షించడంలో భాగంగానే హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారని, కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని తెలిపారు. జీఎల్ఆర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, అధికారుల విజ్ఞప్తి మేరకు రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ వేసినట్టు వివరించారు. అందుబాటులో ఉన్న రికార్డులు, జియో కోఆర్డినేట్ల ఆధారంగానే చర్యలు చేపట్టినట్టు పేరొన్నారు.
ఈ దశలో ధర్మాసనం హైడ్రా తీరుపై పలు ప్రశ్నలు సంధించింది. కేవలం అధికారులు విజ్ఞప్తి చేశారని వెంటనే మొత్తం యంత్రాంగంతో వెళ్లి చర్యలు తీసుకుంటరా? కనీసం భూమికి సంబంధించిన రికార్డులు పరిశీలించరా? అని ప్రశ్నించింది. సర్వే నంబర్‌కు సంబంధించిన కనీస విచారణ కూడా చేయకుండా చర్యలు ఎలా చేపడుతారని నిలదీసింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత హైడ్రాపై ఉన్నప్పటికీ.. వివాదాస్పద భూముల విషయంలో కోర్టు వ్యవహారాలు, హకులకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించాల్సిన బాధ్యత ఉందని డివిజన్ బెంచ్ గుర్తుచేసింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న హైడ్రా చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించాలన్న విషయాన్ని విస్మరించొద్దని తేల్చి చెప్పింది. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతోపాటు ప్రైవేట్ వ్యక్తుల హకులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నదని పేరొంది. వివాదాస్పద భూముల్లోకి వెళ్లే ముందు హైడ్రా కమిషనర్ మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది.
కోర్టుకు హామీ ఇచ్చాక కూల్చివేతలు
శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. హైడ్రా, రంగనాథ్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అధికారులు కోర్టుకు ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి తమ నిర్మాణాలను కూల్చివేశారని ఆరోపించారు. భూమి హద్దుల విషయంలో స్పష్టత లేకపోయినందున సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సమగ్ర సర్వే నిర్వహించి హద్దులను నిర్ధారించాలని అన్నారు. ఒకే పిటిషన్లో మూడు కోర్టు ధికరణ వ్యాజ్యాలు దాఖలు చేయాల్సివచ్చిందని, పలుసార్లు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించినప్పటికీ హైడ్రా కమిషనర్ ఖాతరు చేయలేదని చెప్పారు. కోర్టు ఆదేశాలను అమలు చేయని ఉన్నతాధికారి విషయంలో సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని కోరారు.
స్టే ఆదేశాలను జారీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. వివాదాస్పద 40 ఎకరాల భూమిలో హైడ్రా జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. భూమిపై యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా కూల్చివేతలు, హైడ్రా కమిషనర్‌ను బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి సూచన.. ఇవి రెండు వేర్వేరు విషయాలుగా పరిగణించి విచారణ చేస్తామని ప్రకటించింది. తదుపరి విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.