హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కావాలనుకునే వేలాది మంది విద్యార్థుల జీవితాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. మెడికల్ అడ్మిషన్లలో స్థానికత నిర్ధారించడంలో ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా విఫలం అవుతున్నది. తీరా ఇప్పుడు అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత మళ్లీ హడావుడి చేస్తున్నది. వేలాది మందిని గందరగోళానికి గురి చేస్తున్నది. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 వివాదాస్పదం అయ్యిం ది. దీనిప్రకారం ఇంటర్ వరకు నాలుగేండ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలి. అంటే 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులు మాత్రమే స్థానిక కోటాలో అర్హులు అవుతారు. తెలంగాణలో పుట్టి, పదోతరగతి వరకు ఇక్కడే చదివి ఇంటర్ కోసం ఇతర రాష్ర్టాల్లో చదివిన విద్యార్థులు జీవో 33తో తమకు అన్యాయం జరుగుతుందని వాదించారు. ఇతర ఉద్యోగ, విద్యా సంబంధ నోటిఫికేషన్ల ప్రకారం ఏడేండ్లలో నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారని, దానినే అమలు చే యాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కాదనడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశం పై వాదనలు విన్న ధర్మాసనం జీవో 33ని తప్పుబట్టడంతోపాటు పిటిషనర్లను కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని నిరుడు సెప్టెంబర్‌లో ఆదేశించింది. త్వరలో స్థానికతను నిర్ధారించాలని సూచించింది. అయినా వైద్యారోగ్యశాఖ ఇప్పటివరకు నిర్లక్ష్యం ప్రదర్శించింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్రం హామీ ఇవ్వడంతో హైకోర్టు తీర్పు అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ అప్పీల్‌పై ఆగస్టు 5న విచారణ జరుగనున్నది. మరోవైపు.. ఇదే అంశంపై ఈ నెల 23న హైకోర్టు మరోసారి స్పష్టమైన తీర్పుచెప్పింది. అడ్మిషన్లు చేపట్టడానికి ముందు వరసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలనే నిబంధన విషయంలో పట్టుబట్టరాదని, స్థానికులకు అవకాశం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ పీ శ్యాంకోశీతో కూడిన ధర్మాసనం కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. మరోవైపు ఏపీ హైకోర్టు సైతం సోమవారం ఇలాంటి తీర్పే ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ హడావుడి మొదలుపెట్టింది.
స్థానికత అంశంపై జీవో 33కు వ్యతిరేకంగా తెలంగాణ, ఏపీ హైకోర్టుల తీర్పులు ఉండ టం, ఆగస్టు 5న సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో ప్రభుత్వం సోమవారం హైడ్రా మా చేసింది. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేలా కోర్టులో వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేశారు.
మెడికల్ అడ్మిషన్లపై నిరుడు గందరగోళం మొదలైన వెంటనే మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ప్ర భుత్వం ప్రత్యేక అధ్యయనం చేయించి స్థానికతను నిర్ధారించాలని విజ్ఞప్తిచేశారు. విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలని కో రారు. తెలంగాణ బిడ్డల ఎంబీబీఎస్ కల నెరవేర్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం కష్టపడి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, మెడికల్ సీట్లు పెంచిందని, విద్య, ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లను 85 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. కాబట్టి దానికి అనుగుణంగా స్థానికతను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం ఇదే విషయాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఏడాది కావస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించి, తీరా ఇప్పుడు అడ్మిషన్ల సమయంలో హడా విడి చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో తెలంగాణలో ఇంటర్ చదువుకున్న ఏపీ విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమను స్థానికులుగా పరిగణించాలంటూ 53 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం వాదనలు విన్నది. మెడికల్ కౌన్సెలింగ్‌లో తమను ఏపీ స్థానికులుగా పరిగణించి, దరఖాస్తులు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని ఆమోదించింది. వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. ఈ పిటిషన్లపై సమగ్రంగా లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అడ్మిషన్లు తుది తీర్పుకు లోబడి ఉం టాయని షరతు విధించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు లాయర్లు వాదిస్తూ.. అభ్యర్థులంతా పదో తరగతి వరకు ఏపీలో, ఇంటర్ తెలంగాణలో, ఇతర రాష్ర్టాల్లో చదివారని చెప్పారు. ఇప్పుడు వారిని స్థానికులు కాదంటే ఎలాగని ప్రశ్నించారు. ఆధార్ కార్డులు ఏపీలోనే ఉన్నాయని, తల్లిదండ్రులు ఏపీలోనే ఉంటున్నారని స్పష్టంచేశారు. రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివారని చెప్పి నాన్‌లోకల్‌గా పరిగణించడం దారుణమన్నారు. దీనిపై ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ న్యాయవాది టీవీ శ్రీదేవి స్పందిస్తూ, స్థానిక, స్థానికేతరులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోల మేరకే అడ్మిషన్లు జరుపుతున్నట్టు తెలిపారు.
నీట్ 2025 మెడికల్ సీట్ల భర్తీలో జీవో 33ను అమలు చేసి స్థానిక విద్యార్థులకు 85 శాతం సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిపాలనా భవనం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డికి వినతిపత్రం అందజేశారు. – వరంగల్ చౌరస్తా