హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్‌రెడ్డి సర్కారు పట్టింపులేనితనం కారణంగా అనుమతులు రాకుండా పోతున్నాయి. రెండేండ్ల క్రితమే ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా, ఇప్పటికీ కేంద్ర పర్యావరణ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీచేయలేదు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ దిశగా చేసిన ప్రయత్నమేదీ లేదు. సమీకృత సీతమ్మసాగర్ ప్రాజెక్టుదీ అదే పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుమతులు మంజూరవుతున్నాయి. ఆ ఘనత తనదేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇతర ప్రాజెక్టుల అనుమతుల సాధనపై ఏమాత్రం దృష్టిపెట్టకపోవడం గమనార్హం. కాంగ్రెస్ తీరు వల్ల పదేండ్లుగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరవుతున్నదని తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీటికి, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు ఏపీతోపాటు స్వరాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతలు సృష్టించని అడ్డంకులు లేవు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎన్జీటీ మొదలు సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, సదరన్ జోనల్ కౌన్సిల్ వరకు అన్ని వేదికలపైనా కుట్రలకు తెరలేపారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కవోని దీక్షతో వాటన్నింటినీ అధిగమించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసి 2022 సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి సమర్పించారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) నుంచి పర్యావరణ అనుమతుల కోసం 34వ ఈఏసీ సమావేశం నుంచే తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈఏసీ కోరిన విధంగా సంబంధిత డాటాను సమర్పించడమేగాక, ప్రాజెక్టు పరిధిలోని కరువు పీడిత ప్రాంతాల పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించింది. దీంతో ఎట్టకేలకు 49వ ఈఏసీ సమావేశం అంగీకరించింది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. దాదాపు రెండేండ్లు గడిచినా కేంద్రం అనుమతులు మంజూరు చేయలేదు. అనుమతులను తీసుకొచ్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు చేసిన ఒక్క ప్రయత్నం కూడా లేదు.
వాస్తవంగా ఈసీ అనుమతులపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులను కట్టడం, ఆ తరువాత జరిమానాలను విధించి వాటిని రెగ్యులరైజ్ చేయడం దేశంలో పరిపాటిగా మారింది. ఇదే విషయమై ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగానే ముందస్తు అనుమతులు లేకుండా ప్రారంభించి, ప్రస్తుతం ఈసీ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల మంజూరును సుప్రీంకోర్టు నిలిపేసింది. అయితే కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ పరిధిలోకి పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్ ప్రాజెక్టులు రాబోవనేది అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించిన వెంటనే పలువురు ఎన్జీటీని ఆశ్రయించారు.
ఆ పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ రూ.828 కోట్ల మేర జరిమానా విధించింది. దీనిని సవాల్ చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ధర్మాసనం ఎన్జీటీ తీర్పుపై స్టేను విధించింది. తాగునీటి అవసరాలకు సంబంధించి 1వ దశ పనుల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా పర్యావరణ నష్టాన్ని అంచనా వేయాలని, అందుకు కమిటీని నియమించాలని, ఆ కమిటీ నివేదిక మేరకు పర్యావరణ నష్టపరిహారం నిధులను చెల్లించాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. అందుకనుగుణంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సబ్‌కమిటీని నియమించింది. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను సైతం ఎన్జీటీకి సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించి ఆ నివేదికకు అనుగుణం పరిహారం చెల్లించాల్సి ఉన్నది. తద్వారా ఈసీ వచ్చే అవకాశమూ ఉన్నది. సుప్రీంకోర్టును ఆశ్రయించి సైతం అనుమతులు సాధించవచ్చు.
కానీ, రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం ఈ అంశాలపై ఇప్పటికీ దృష్టి సారించలేదు. ఎన్జీటీని, సుప్రీంకోర్టును ఆశ్రయించిన దాఖలా లేదు. అనుమతుల సాధనకు ఎలాంటి ప్రక్రియనూ చేపట్టలేదు. అధికారంలోకి వచ్చిన అనంతరమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రిని కలిశారు. పాలమూరు-రంగారెడ్డికి నిధులు సాయం చేయాలని కోరారు. ప్రచారం చేసుకున్నారు. ఆ తరువాత ప్రాజెక్టుపై దృష్టిసారించిన దాఖలాల్లేవు. సీఎం, మంత్రులు కలిసి వచ్చిన అనంతరమే కేంద్రం తెలంగాణ సర్కారుకు స్పష్టమైన జవాబు చెప్పింది. ట్రిబ్యునల్ వివాదం నేపథ్యంలో అనుమతులివ్వడం కుదరదని, మరేవిధంగానైనా ఆర్థిక సాయం అందిస్తామని స్పష్టంచేసింది.
అయినప్పటికీ కాంగ్రెస్ సర్కారు ఆయా అనుమతుల సాధనకు కావాల్సిన కృషి చేయలేదు. కాంగ్రెస్ తీరుతో అప్రయిజల్ లిస్ట్ నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు డీపీఆర్‌ను తొలగిస్తున్నట్టు సీడబ్ల్యూసీ గత డిసెంబర్లోనే తెలిపింది. తెలంగాణ ప్రభుత్వ వ్యవహార తీరుతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు లేఖ రాయడం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతకు అద్దం పడుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా సత్వరమే అనుమతుల సాధనకు, ప్రాజెక్టు పనులను చేపట్టే దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ సమీకృత సీతారామ సీతమ్మసాగర్ బహుళార్థక సాధక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను రూపొందించారు. దీనిపై కూడా పలువురు ఎన్జీటీలో కేసులు వేశారు. అదీ ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలే కావడం గమనార్హం. ఈ పనులకు సంబంధించి ఎన్జీటీ విచారణ చేపట్టి రూ.53 కోట్లను జరిమానా విధించింది. ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యావరణానికి సంబంధించి వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేస్తూ ప్రణాళికను రూపొందించాల్సి ఉన్నది. దానిని ఎన్జీటీకి సమర్పించాల్సి ఉన్నది. కానీ తెలంగాణ సర్కారు అందుకు సంబంధించిన అంశాలను పూర్తిగా పక్కనపెట్టింది. ఆ జిల్లా నుంచే ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఆ పక్రియ గడచిన రెండేండ్లుగా అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం.
గత బీఆర్ఎస్ సర్కార్ గోదావరి, కృష్ణా బేసిన్న్లు కలుపుకుని మొత్తంగా 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు చిన్నకాళేశ్వరం, చౌటుపల్లి హనుమంతరెడ్డి, చనాకా-కొరాట బరాజ్, గూడెం ఎత్తిపోతలు, మోడికుంటవాగు ప్రాజెక్టుల అనుమతులను విజయవంతంగా తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి కేంద్రం వద్ద సీతమ్మసాగర్ మల్టీపర్పస్, సమ్మక్కసాగర్, పాలమూరు-రంగారెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించిన డీపీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో సీతమ్మసాగర్కు ఇటీవల అనుమతులు వచ్చాయి. వాటిలో మిగతా వేటికీ అనుమతులు రాకపోగా, పాలమూరు, వార్ధా, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించిన డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ తిప్పిపంపింది.