హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో విలీనం వల్లే కృష్ణా జల్లాల్లో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. కృష్ణా బేసిన్లో ఏపీ, తెలంగాణ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి అసమానతలను ఇకనైనా సరిదిద్దాలని, బేసిన్‌లోని రైతుల ప్రయోజనాలను కాపాడాలని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం ఢిల్లీలో ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ శుక్రవారం సైతం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట జరిగిన ఈ విచారణలో తెలంగాణ వాదనలను సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వినిపించారు. వర్షపాత వైవిధ్యం తదితర పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల రైతులు, కార్మికుల జీవనోపాధిని నిలబెట్టేందుకు కనీసం ఒక ఆరుతడి పంటకైనా నీటి వసతి అవసరమని స్పష్టం చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బేసిన్ పారామితులను వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ 15% మాత్రమే దక్కుతున్నాయని, ఏపీలోని సాగు విస్తీర్ణంలో 95% మేరకు నికర జలాలు అందుతున్నాయని, ఈ అసమానతలను సరిదిద్దాలని ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేశారు. ఒక్కో టీఎంసీ నీటిని తెలంగాణలో 12,800 ఎకరాలకు అందిస్తుంటే.. ఏపీలో కేవలం 8,400 ఎకరాలకే కేటాయిస్తున్నారని తెలిపారు. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పొదుపుచేసే జలాలను తెలంగాణకు కేటాయించాలని కోరారు. పొదుపు చేసిన జలాలను బేసిన్‌లోని ప్రాజెక్టులకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ పూర్వపు ఏపీ రాష్ట్రం మాత్రం ఎస్ఎల్బీసీని కాదని బేసిన్ అవతలి ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుకు కేటాయించిందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్-1 అవార్డు ప్రకారం ఆ కే టాయింపులను సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎల్బీసీకి నీటి కేటాయింపుల్లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. అనేక చారిత్రక కారణాల వల్ల గతంలో ఏపీకి ట్రిబ్యునల్-1 తగినంత నీరు కేటాయించిందని తెలిపారు. విలీనం జరగకపోతే పాల మూరుకు నీటిపా రుదల సదుపాయం ఉండేదని చెప్పారు. అనంతరం ట్రిబ్యునల్ తదుపరి విచారణను జూలై 23, 24, 25న చేపట్టనున్నట్టు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ప్రకటించారు.