హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ రద్దు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కానీ, మేడిపల్లిలోనే ఫార్మాసిటీని కొనసాగించేదీ లేనిదీ స్పష్టత ఇవ్వకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని, మేడిపల్లిలో సేకరించిన భూముల్లోనే ఫార్మాసిటీని కొనసాగిస్తారో లేదో చెప్పడానికి ఎన్ని వాయిదాలు తీసుకుంటారని నిలదీసింది. ఫార్మాసిటీ భూములపై ధరణిలో లావాదేవీలకు అనుమతించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన డీవీవీ సత్యకొండలరాయ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ శనివారం విచారణ జరిపారు.
ఫార్మాసిటీ వివరాలను సమర్పించేందుకు మరోసారి గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా.. అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఫార్మాసిటీ రద్దయినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను పిటిషనర్లు సమర్పించినప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడంలేదని తప్పుపట్టారు. ఫార్మాసిటీ భూములకు సంబంధించిన పిటిషన్లపై సోమవారం విచారణ చేపడతామని, ఆ లోగా ప్రభుత్వ నిర్ణయంతోపాటు ఫార్మాసిటీకి సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
కాగా, ఫార్మాసిటీ యథాతథంగా కొనసాగుతుందంటూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఫార్మాసిటీ రద్దయినట్టు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆ అఫిడవిట్లో పేర్కొంటూ.. 2016లో జారీ చేసిన జీవో 31 ప్రకారం ఫార్మాసిటీ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దాన్ని రద్దు చేసేందుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు కోసం మేడిపల్లిలో 1,700 ఎకరాల సేకరణకు భూసేకరణ చట్టంలోని సెక్షన్ 11(1) కింద గతంలో ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడిందని గుర్తుచేశారు. అంతకుముందు ఇదే ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 2016లో ప్రభుత్వం జీవో 31ను జారీ చేసిందని, అంతేకాకుండా భూసేకరణ చట్టం కింద కొన్ని మినహాయింపులు ఇస్తూ జీవో 46ను జారీ చేసిందని తెలిపారు.
డిక్లరేషన్, పరిహారం అవార్డు నిబంధనల ప్రకారం జరగలేదన్న ఆరోపణలు అవాస్తవమని, భూసేకరణ చట్టంలోని నిబంధనల ప్రకారమే అక్కడ భూసేకరణ చేపట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వం సేకరించిన భూముల్లో పిటిషనర్‌కు సంబంధించిన 10 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. డిక్లరేషన్ అవార్డుపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారని, ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. అభ్యంతరాల స్వీకరణ సహా భూసేకరణ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశిందని వివరించారు. ఈ ఆదేశాల ప్రకారం భూసేకరణకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ అమల్లోనే ఉన్నదని, ఈ నేపథ్యంలో సదరు భూములపై ధరణి పోర్టల్‌లో లావాదేవీలకు అనుమతించాలన్న పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ తన భూములపై ధరణి పోర్టల్ ద్వారా ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరని పేర్కొన్నారు.
భూసేకరణ ప్రక్రియ అమల్లో ఉన్నందున ధరణిలో ఎంట్రీల కోసం పిటిషనర్ చేసుకున్న దరఖాస్తును అనుమతించలేమని స్పష్టం చేశారు. అంతేకాకుండా అవార్డు నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీళ్లు దాఖలు చేశామని, అవి ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. భూసేకరణ నిమిత్తం రెండు పత్రికల్లో నోటిఫికేషన్‌ను ప్రచురించామని, గ్రామసభ నిర్వహించి నోటీసులు జారీచేయడంతోపాటు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ఆవశ్యకతను అందరికీ వివరించామని చెప్పారు.
ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములకు ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున్న పరిహారం ఇవ్వాలని తొలుత నిర్ణయించినప్పటికీ ఆ తర్వాత దాన్ని రూ.16 లక్షలకు పెంచామని, దానికి అదనంగా రైతులకు 121 చదరపు గజాల చొప్పున స్థలాలను కూడా కేటాయిస్తున్నామని వివరించారు. అవార్డు నోటిఫికేషన్‌పై పిటిషనర్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, నోటీసులకు సమాధానం ఇవ్వనందున అధికారులు జారీ చేసిన పరిహారం మొత్తాన్ని భూసేకరణ అథారిటీ వద్ద డిపాజిట్ చేశామని తెలిపారు.