ఇంటింటి సర్వేలో పాల్గొననివారి వివరాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 16నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్టు తెలిపింది. రీసర్వే ఎలా చేయాలనే దానిపై యంత్రాంగం తర్జనభర్జన పడుతున్నది. ప్రత్యేక యాప్, సాఫ్ట్వేర్ లేకుండానే సర్వే చేస్తున్నందున రిపిటేషన్ బెడద పొంచి ఉన్నదని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
Caste Survey | హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వేను గత నవంబర్‌లో ప్రారంభించింది. తొలుత ఎన్యుమరేటర్లతో ఇండ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత స్టిక్కరింగ్ చేసిన ఇం ట్లోని వారి వివరాలను నమోదు చేయించింది. సేకరించిన వివరాలను డాటా ఎంట్రీ చేయించింది. మొత్తంగా 3 పద్ధతుల్లో సర్వేను మమ అనిపించింది. సర్వేకు సంబంధించి ఎలాంటి ప్రామాణిక పద్ధతులను పాటించలేదు. ఎన్యుమరేటర్లకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కానీ వివరాల నమోదుకు ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌ను, సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు.
మాన్యువల్‌గా డాటా సేకరించి, ఆ వివరాలను ఆపై ఎంట్రీ చేశారు. ఆధార్, రేషన్‌కార్డు తదితర వివరాలను ఐచ్ఛికంగానే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నమోదు చేసుకున్నవారు ఎవరు? వివరాలు నమోదు చేసుకోనివారు ఎవరు? అనేది తేల్చిచెప్పడం అసాధ్యమని అధికారులే వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే వివరాలను నమోదు చేసుకున్న వారు మళ్లీ వివరాలను నమోదు చేసుకుంటే గుర్తించడం కష్టమనే భావన వెల్లువెత్తుతున్నది. దీంతో రిపిటేషన్స్ పెరిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.70 కోట్ల జనాభా ఉండగా, అందులో 16 లక్షల (3.1శాతం) జనాభా వివరాలను నమోదు చేయించుకోలేదని ప్రభుత్వం తెలిపింది. వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. గతంలో నిర్వహించిన సర్వేలు, వివిధ జాతీయస్థాయి విభాగాలు వెల్లడించిన గణాంకాలతో పోల్చితే తాజా సర్వే గణాంకాల్లో భారీ వ్యత్యాసమున్నది. అరకోటికిపైగానే జనాభా సర్వేలో పాల్గొనలేదని తెలుస్తున్నది. ఇప్పుడు వారంతా సర్వేలో పాల్గొంటే గణాంకాలన్నీ తారుమారయ్యే పరిస్థితి ఉంటుందని బీసీ నేతలు, మేధావులు వెల్లడిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తున్నదని మండిపడుతున్నారు.
ఇప్పటికీ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను, ఓ యాప్‌ను రూపొందించలేదని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే సేకరించిన డేటాను క్రోడీకరించి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని తద్వారా రిపిటేషన్లను నివారించవచ్చని తెలుపుతున్నారు. లేదంటే ఒక్కరే పలుచోట్ల, పలుమార్లు వివరాలను ఎంట్రీ చేయించుకునే అవకాశం ఏర్పడుతుందని, ఫలితంగా డాటానే ప్రామాణికత లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని, లోపాలు లేకుండా రీసర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మళ్లీ అశాస్త్రీయ పద్ధతుల్లోనే సర్వేను చేస్తే మళ్లీ అసమగ్ర వివరాలే వస్తాయి తప్ప.. సమగ్ర వివరాలు రాబోవని తేల్చిచెబుతున్నారు.