Pharma City | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోనే గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నది. రైతులతో ఘర్షణ వైఖరి ఉండదని, వారి సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేసింది. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం జారీచేసిన భూసేకరణ అవార్డు నోటిఫికేషన్‌ను గతంలో సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసినట్టు తెలిపింది. అయినప్పటికీ పిటిషనర్లయిన రైతులకు రైతుబంధు, పంట రుణాలు, ఇతర పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది. రైతుబంధు కోసం వారంలోగా దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించింది. రైతులు పంటరుణాలు, రైతుబంధు వంటి పథకాల కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వాటిపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, పిటిషనర్లు కూడా అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది.
భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తమ భూమిపై నిషేధిత ఉత్తర్వులు తొలగించాలని, ధరణి పోర్టల్‌లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ పలువురు రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం మరోసారి విచారణ జరిపారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఫార్మాసిటీ ఏర్పాటు కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మారెట్ ధరకు అనుగుణంగా భూములకు పరిహారం చెల్లింపుపై రైతులతో చర్చలు జరుగుతున్నట్టు చెప్పారు. రైతుబంధు కోసం రైతులు దరఖాస్తు చేస్తే పరిశీలించి చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. సింగిల్ జడ్జి తీర్పుతో భూసేకరణ రద్దయ్యిందని, కాబట్టి ధరణి పోర్టల్‌లో రైతులు లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. తద్వారా సింగిల్ జడ్జి తీర్పును ఆమోదించినట్టు అవుతుందని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, పిటిషనర్లు అదనపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.