NAAC | హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): నిధుల సమీకరణకు భూముల అమ్మకమే పనిగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన భూములపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. హెచ్‌సీయూ భూముల విక్రయ వ్యవహారం బెడిసికొట్టడంతో హైటెక్‌సిటీలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) ఆధీనంలో ఉన్న సుమారు 60 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ భూములను అమ్మేస్తే కనీసం రూ.6,000 కోట్లు వస్తాయని ప్రభుత్వ అంచనా. న్యాక్ భవనాన్ని కూడా తొలగించి మరేదైనా ప్రాంతంలో న్యాక్ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
నిర్మాణరంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మాణ రంగానికి పరిచయం చేసేందుకు, కార్మికుల నుంచి చీఫ్ ఇంజినీర్ల వరకు తగిన శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన ఈ సంస్థను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్మాణ రంగానికి అవసరమైన నిపుణులను తయారుచేసేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1998లో న్యాక్‌ను ఏర్పాటుచేసింది.
ముఖ్యమంత్రి చైర్మన్‌గా, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్ చైర్మన్లుగా, వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు బోర్డు సభ్యులుగా కార్యనిర్వాహక మండలిని ఏర్పాటుచేశారు. సుమారు 167 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో నోవాటెల్ హోటల్, హైటెక్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్, న్యాక్ తదితర వాటిని ఏర్పాటుచేశారు. ఇందులో సుమారు 15 ఎకరాలను గతంలో హ్యుండాయ్ కంపెనీకి విక్రయించారు. కాగా, న్యాక్ భవనం సహా దాని ఆధీనంలో సుమారు 60 ఎకరాల వరకు స్థలం ఉన్నది.
ఇందులో ఐదు ఎకరాల స్థలాన్ని గతంలో క్విప్పో కన్స్ట్రక్షన్ ఎక్యూప్మెంట్ కంపెనీకి లీజుకి ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉండటంతో సదరు కంపెనీ నష్టాలు వచ్చాయంటూ ప్రభుత్వానికి పైసా కూడా చెల్లించకుండా ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్’ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను, భవనాన్ని సీజ్‌చేసి న్యాక్ భూములు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.
మరోవైపు, న్యాక్‌లో కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమాల కోసం హైటెక్‌సిటీ ప్రాంతంలోని ఎంతో విలువైన భూములు, భవనాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, భూములు ఖాళీగా ఉంటే అన్యాక్రాంతమవుతాయని, నకిలీపత్రాలను సృష్టించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారని, అందుకే తామే భూములను విక్రయించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు సుమారు ఆరు నెలల క్రితమే న్యాక్ ఆధీనంలోని భూములు, అక్కడ కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమాలు, న్యాక్ అవసరాలు తదితర అంశాలతో కూడిన సమగ్ర సమాచారంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
అంతేకాదు, ఆర్అండ్బీ శాఖ మంత్రి స్వయంగా న్యాక్‌ను సందర్శించి అక్కడి భూములను పరిశీలించి వచ్చారు. ప్రస్తుతం ఉన్న న్యాక్ భవనాన్ని కూడా తొలగిస్తే దాదాపు 60 ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని అంచనా వేశారు. అక్కడ ఎకరం భూమి ధర రూ.100 కోట్లకుపైగా ఉండటంతో మొత్తం న్యాక్ భవనాన్ని కూడా తొలగించి 60 ఎకరాలు విక్రయిస్తే రూ.6,000 కోట్లకుపైగా నిధులు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. న్యాక్ భవనాన్ని కూడా తొలగించి, అవసరమైతే ఔటర్ రింగురోడ్డు సమీపంలో న్యాక్ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల హెచ్‌సీయూ భూముల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం క్లియర్ టైటిల్ భూములపై కన్నేసినట్టు తెలిసింది. ఎటువంటి వివాదాలు లేకుండా, ఎవ్వరూ జోక్యం చేసుకునే అవకాశం లేని భూములను గుర్తించి విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు, సమాచారం లీక్ కాకుండా అధికారులకు గట్టి హెచ్చరికలు పంపినట్టు తెలిసింది. న్యాక్‌కు కేటాయించిన భూముల్లో ఎటువంటి లిటిగేషన్లు వచ్చే అవకాశం లేదని, అందుకే న్యాక్ భూములను విక్రయించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం.
నిర్మాణరంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్ధతులపై ఎప్పటికప్పుడు కార్మికుల నుంచి చీఫ్ ఇంజినీర్ల వరకు అవగాహన కల్పించేందుకు న్యాక్‌లో నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ విదేశాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన ఇంజినీరింగ్ కాలేజీలు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, పరిశోధనా సంస్థలు, ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం.. న్యాక్ వంటి శిక్షణా సంస్థలను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా వివిధ జిల్లాల్లో సైతం ఏర్పాటుచేసింది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుండటంతో నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా కేసీఆర్ సర్కారు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం న్యాక్ భూములను విక్రయించి దానికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.