హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): నిరవధిక సమ్మెకు దిగిన విద్యుత్తు శాఖ ఆర్జిజన్ కార్మికులతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడటంతో చర్చలను ఈ నెల 17వ తేదీకి వాయిదావేశారు. దీంతో సమ్మెను యథావిధిగా కొనసాగించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టిజన్ల సమ్మె ఆరోరోజైన సోమవారం కూడా విజయంతమైందని జేఏసీ నేతలు ప్రకటించారు. కార్మికశాఖ మధ్యవర్తిత్వంతో ఆ శాఖ జాయింట్ కమిషనర్ సునీత సమక్షంలో సోమవారం చర్చలు జరిగాయి. అన్ని కంపెనీల జాయింట్ సెక్రటరీలు ఈ చర్చలకు హాజరు కాగా, ఆర్టిజన్ల జేఏసీ నుంచి కో చైర్మన్లు సాయిలు, చంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, అన్మ్యాన్డ్ కార్మికుల విలీనం, కనీస వేతనం, 2026 పీఆర్సీ కమిటీ వేసి ఆర్టిజన్ కార్మికులకు నూతన పీఆర్సీ వర్తింపజేయాలన్న ప్రధాన డిమాండ్లను ఆర్టిజన్ జేఏసీ నేతలు సర్కార్ ముందుంచారు. ఆయా అంశాలను నోట్ చేసుకొన్న విద్యుత్తు సంస్థల ప్రతినిధులు యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో చర్చలను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు.
ఆర్టిజన్ కార్మికుల సమ్మెను బుధవారం నుంచి మరింత ఉధృతం చేయాలని, ఆందోళన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మెకు బీఎంఎస్, సీఐయూటీ, టీఆర్వీకేఎస్ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మిక సంఘాలు, పవర్ జేఏసీ నేతలు, ఆర్టిజన్ జేఏసీ నేతలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీరితోపాటు మరో రెండు కార్మిక సంఘాలు నైతిక మద్దతు ప్రకటించాయి.
వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీ కింద టీజీ ట్రాన్స్‌కోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల కోట్లు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పాలనాపరమైన అనుమతులు మంజూరుచేస్తూ సోమవారం జీవోను జారీచేసింది. ఈ మొత్తంలో ఏప్రిల్ నెల నుంచి నెలకు రూ.1,166.67 కోట్ల చొప్పున సమాన వాయిదాల్లో డిస్కమ్‌లకు చెల్లించాలని సర్కార్ సూచించింది.