హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారుల సహాయార్థం రాష్ట్ర సర్కారు రూ.76 కోట్లతో ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలవారీగా బ్యాంకు ఖాతాలను తెరిచి అందులో ఆ మొత్తాన్ని జమ చేసింది. దళితజాతి సాధికారతకోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న తరహాలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నిరుపేద దళితులు తమకు నచ్చిన, వచ్చిన పనిని సొంతంగా చేసుకొనేందుకు ఎలాంటి షరతులు, బ్యాంకు లింకేజీలు లేకుండా ప్రభుత్వమే ఏక మొత్తంగా రూ.10 లక్షలను అందిస్తున్న సంగతి విదితమే. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 38,323 మందికి రూ. 10 లక్షల చొప్పున నిధులను మంజూరు చేయగా, లబ్ధిదారులు యూనిట్లను కూడా ఏర్పాటు చేసుకొన్నారు.
దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకొన్న యూనిట్‌కు ఊహించని రీతిలో నష్టం వాటిల్లిన సందర్భంలో.. సదరు లబ్ధిదారుడికి పరిహారం అందించి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే దళితబంధు పథకం ప్రారంభంలోనే దళిత రక్షణ నిధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. లబ్ధిదారుడికి అందజేస్తున్న రూ.10 లక్షల నుంచి రూ.10 వేలు, ప్రభుత్వ వాటాగా రూ.10 వేలను కలిపి నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారుల నుంచి రూ.10 వేల చొప్పున రూ.38.32 కోట్లను రక్షణ నిధికి కేటాయించారు. నియోజకవర్గాలవారీగా ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్లను తీసి ఈ నిధులను ఆయా అకౌంట్లలో జమ చేశారు. ప్రభుత్వం ఇటీవలే తన వాటా 38.32 కోట్లను విడుదల చేయగా, ఆ మొత్తాన్ని కూడా నియోజకవర్గాల వారీగా అకౌంట్లలో జమ చేశారు. మొత్తంగా రూ.76.64 కోట్లకు పైగా నిధులతో దళితబంధు రక్షణ నిధి ఏర్పాటయ్యింది.
దళిత రక్షణ నిధికి కలెక్టర్ బాధ్యులుగా కొనసాగనున్నారు. దళితబంధు లబ్ధిదారుడు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల నష్టపోయినప్పుడు తిరిగి అతనికి ఆర్థిక చేయూతనందివ్వడమే దళిత రక్షణ నిధి ముఖ్య ఉద్దేశం. అయితే అందుకు సంబంధించి నష్టపోయిన లబ్ధిదారుడు కలెక్టర్‌కుగానీ, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఈడీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జరిగిన నష్టాన్ని వివరించాల్సి ఉంటుంది. దానిపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నివేదికను రూపొందిస్తారు. దీన్ని ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి పొందిన అనంతరం సదరు దళితబంధు లబ్ధిదారుడికి దళితరక్షణ నిధి నుంచి తిరిగి పరిహారం అందించేలా ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు రూపొందించింది.