హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. మొన్నటివరకు 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్తూ వచ్చిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాజాగా 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ధాన్యం కొనుగోళ్లపై పలువురు మంత్రులు, అధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ… నెలాఖరుకల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సీజన్లో 141 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా ఉన్నదని, ఇందులో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలను ఏర్పాటుచేసి ఇప్పటివరకు 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.8,749 కోట్లు చెల్లించామని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న 8.5 లక్షల టన్నుల ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. తాలు, తరుగు విషయంలో రైస్ మిల్లర్లు, దళారులు రైతులను మోసం చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.