హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇంటి శ్లాబ్ ముందు వైపు మూడు అడుగులు, మిగతా వైపులు ఒక అడుగు మాత్రమే ఉండాలని కొత్త కొర్రీ తీసుకొచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. చాలాచోట్ల లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ముందువైపు గోడల కంటే 3 నుంచి 8 అడుగుల వరకు శ్లాబ్‌ను పొడిగిస్తున్నారని తెలిపింది.
దీంతో ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సాయం చాలక, మిగిలిన మొత్తానికి అప్పులు చేస్తున్నారని, కొందరు నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారని తెలిపింది. ఈ ఇబ్బందులను అరికట్టేందుకు శ్లాబ్ వైశాల్యంపై పరిమితులు విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. శ్లాబ్ 600 చదరపు అడుగులు ఉంటే శ్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు మించొద్దని నిబంధన పెట్టింది. ఒకవేళ శ్లాబ్ 400 చదరపు అడుగులు ఉంటే శ్లాబ్ ఏరియా 500 చదరపు అడుగులు మించొద్దని సూచించింది.
శ్లాబ్‌ను పెంచే బదులు లబ్ధిదారులు వర్షం, ఎండ నుంచి రక్షణకు తలుపులు, కిటికీలపై సజ్జలు, లేదా సన్ షేడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చింది. ఇంటిముందు నీడ కోసం కాంక్రీట్ శ్లాబ్‌ను వాడకుండా తక్కువ ఖర్చుతో జీఐ షీట్లను ఉపయోగించాలని స్పష్టంచేసింది. ఈ నిబంధనలు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. వర్షం, ఎండ నుంచి రక్షణకు ఇండ్ల నిర్మాణ సమయంలో ఇంటిముందు శ్లాబ్ విస్తీర్ణం ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తాము చెప్పినట్టు నిర్మిస్తేనే బిల్లులు చెల్లిస్తామని గతంలో చెప్పింది. తాజా నిబంధన పాటించకపోతే బిల్లులు చెల్లించబోమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసినట్టయింది.