హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మెదక్ పోలీస్ స్టేషన్లో ఖదీర్ ఖాన్ అనే వ్యక్తి మరణించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శితోపాటు మెదక్ ఎస్పీ, మెదక్ ఎస్హెచ్ఓ తదితరులకు నోటీసులు జారీ చేసింది. దొంగతనం కేసులో అరెస్టయిన ఖదీర్ ఖాన్.. గాయాల కారణంగా హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ గత ఫిబ్రవరిలో మరణించాడు. ఖదీర్ ఖాన్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మరణించాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఖదీర్ ఖాన్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని, సీసీ ఫుటేజీని భద్రపర్చేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. పిటిషనర్‌కు రూ.50 లక్షల పరిహారాన్ని ఇప్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖదీర్ ఖాన్ మృతి ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి గతంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆ పిల్‌తోపాటు రిట్‌ను కలిపి విచారిస్తామని తాజాగా ప్రకటించింది.