హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): దేవాలయాల్లో వేద పండితుల నియామకాలకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రాత పరీక్ష నిర్వహించాలన్న రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయం వివాదాస్పదమైంది. నిజానికి, ‘వేదం’ అనేది మౌఖికంగా మాత్రమే నేర్చుకొనేది. వేద విద్యలో అత్యంత కీలకమైనది ఉచ్ఛారణ. ఇది ఒకరు రాసిస్తే, చదివి నేర్చుకొనేది కాదు! కానీ, వేదపారాయణదారుల ఎంపికకు రాష్ట్ర దేవాదాయ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో మౌఖిక పరీక్షతోపాటు రాత పరీక్ష కూడా నిర్వహిస్తామని పేర్కొనడంతో సీనియర్ వేద పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 324 మతపరమైన ఉద్యోగాల భర్తీకి గత డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ.. అందుకు సంబంధించిన ఎంపిక కమిటీల ప్రక్రియను కూడా పూర్తి చేసింది.
ఈ క్రమంలో స్థానాచార్య, వేదపారాయణదారు, అర్చకులకు మౌఖిక పరీక్షతోపాటు రాత పరీక్ష కూడా నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నది. పరిచారిక, సహాయక పాచక, డోలు, సన్నాయీ, శ్రుతి, తాళం వంటి భజంత్రీలకు మౌఖిక పరీక్ష మాత్రమే ఉంటుందని తెలిపింది. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా వేదపారాయణదారులు రాత పరీక్ష రాయాలన్న నిబంధన విధించడంతోపాటు రాతపరీక్షకు 80 మార్కులు, మౌఖికానికి 20 మార్కులు కేటాయించడంతో వేదపండితలోకం ముక్కున వేలేసుకుంటున్నది. అసలు వేద పారాయణదారులు నిర్వర్తించే విధులేమిటి? వారికి అవసరమైన విధానాలేమిటో తెలియని వారు ఈ పరీక్ష విధానాన్ని తయారుచేశారనే విమర్శలొస్తున్నాయి.
రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలను రాయడమేమిటని వేదపండితులు ప్రశ్నిస్తున్నారు. వేదాలకు ‘అపౌరుషేయాలు’ అని పేరు. బ్రహ్మ నోటి నుంచి వచ్చిన వాటిని ఋషులు వినడం వల్ల వాటికి ‘శ్రుతులు’ అని పేరు వచ్చింది. వాటిని గుర్తు పెట్టుకుని శిష్యులకు చెప్పారు కనక వాటికి ‘స్మృతులు’ అనే పేరు వచ్చిందని వేదపండితులు చెప్తున్నారు. వేదానికి స్వరమే తప్ప రాయడం కష్టం. అందునా శిరస్వరం, హస్తస్వరం, స్వరస్వరమనే మూడు రకాల పద్ధతుల్లో వేదాన్ని నేర్చుకుంటారని పేర్కొన్నారు. ‘సామవేదం గానానికి సంబంధించినది. దీనిని ఎలా రాస్తాం? రాసినా ఆ పత్రాలను దిద్దేవారు ఎవరు? వేదానికి ప్రామాణిక లిఖిత రూపమే లేనప్పుడు ఏ ప్రామాణిక గ్రంథం ఆధారంగా సమాధాన పత్రాలను దిద్దుతారు?’ అని ఒక వేద పండితుడు ప్రశ్నించారు.
దేవాదాయ శాఖ పరంగా వేదపారాయణదారు పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనల విషయంలో గతంలో జరిగిన నియామకాలకూ, తాజా నోటిఫికేషన్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదని అభ్యర్థులు చెప్తున్నారు. 2020 మార్చిలో వేదపారాయణదారు నియామకాలకు సంబంధించి దేవాదాయ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని దేవాలయాల్లో ఖాళీలు ఉన్నాయో గుర్తించి, వాటిన్నింటికీ ఒకే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపట్టింది. ఆ సందర్భంలో వేదపారాయణదారు పోస్టుకు హాజరయ్యే అభ్యర్థులకు మౌఖిక పరీక్ష మాత్రమే నిర్వహించారని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
అయితే, తాజా నోటిఫికేషన్ విషయంలో తమ శాఖ నుంచి కేవలం ఖాళీలు గుర్తించే ప్రక్రియను మాత్రమే పూర్తిచేశామని, మిగతా నియామక విధివిధానాలను దేవాదాయ శాఖకు ధార్మికమైన సలహాలిచ్చే బాధ్యతలో ఉన్న ఒక వ్యక్తితోపాటు శాఖకు సంబంధమేలేని కొందరు ప్రైవేట్ వ్యక్తుల జోక్యంతో రూపకల్పన చేశారని ఆ అధికారి చెప్పారు. వేదం ఎంతసేపూ మౌఖికమే కాగా లిఖితంగా ఎక్కడా సాధ్యపడదని, కానీ ఎలాంటి అవగాహన లేకుండా ఈ పోస్టుల్లో తమ వారిని నియమించుకోవడానికి కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నమే ఈ రాతపరీక్షల వ్యవహారమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేదపండితుల నియామకాలకు సంబంధించి గత సంవత్సరం డిసెంబర్ 4న దేవాదాయ శాఖ నియమించిన సెలక్షన్ కమిటీపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో వేద పాఠశాలల నిర్వాహకులు ఉండటం, వారే ప్రధాన ఎగ్జామినర్‌గా ఉండటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. వేద పారాయణదారుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారిలో ఎంతమంది వారి పాఠశాలకు చెందినవారు ఉన్నారో.. అంటూ వేదపండితులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ కమిటీలో చీఫ్ ఎగ్జామినర్‌గా వేదభవన్ నిర్వాహకుడు డాక్టర్ శ్రీరామ్ ఘనాపాఠి వ్యవహరిస్తుండగా, రుగ్వేదానికి శ్రీవత్సశర్మ ఘనాపాఠి, యశ్వంత్‌కుమార్, యజుర్వేదానికి ఫణివెంకటరామదీక్షితులు ఘనాపాఠి, అధర్వణవేదానికి పాండురంగజోషి, సామవేదానికి ప్రశాంత్ షడంగిలను ఎగ్జామినర్లుగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఏడీసీ ఉత్తర్వులు జారీ చేశారు.
రెగ్యులర్‌గా తెలంగాణ దేవాలయాల్లో వేదపండితులుగా పనిచేస్తున్నవారు చాలామంది ఉన్నప్పటికీ, వారెవరినీ కాదని టీటీడీ ద్వారా నియమితులైన వేదపండితులను పరీక్షల నిర్వహణాధికారులుగా నియమించడమేమిటని పలువురు వేదపండితులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అచ్చలాపూర్, కీసర వంటి ప్రముఖ వేద విద్యాలయాల్లో చదువుకుని నాలుగు వేదాల్లో పండితులుగా రాణిస్తున్నవారు చాలామంది ఉన్నప్పటికీ వారెవరినీ కాదని, దేవాదాయ శాఖ పరిధిలోనే పనిచేస్తున్న వారిని కూడా విస్మరించడం వల్ల పరీక్షలకు హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని వారు పేర్కొన్నారు. మరోవైపు, అసలు వేద పరీక్షలు నిర్వహించే ఈ ఎగ్జామినర్ల విషయంలోనూ ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయని, వారి వెనుక దేవాదాయ శాఖకు చెందిన ఓ ముఖ్యమైన వ్యక్తి ఉండి నియామకాలు ఎలా జరుగాలో, ఎవరిని నియమించాలో చెప్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
వేదపారాయణదారుల ఎంపికలో స్వరాలతో రాతపరీక్షలు పెట్టడం అన్యాయమే. 11 ఏండ్లుగా విద్యారణ్యం వేదపాఠశాల నడుపుతున్నాను. గతంలో మా విద్యార్థులు పరీక్ష ఇచ్చిన తర్వాత వారిని చాలా ఇబ్బందులు పెట్టారు. సహజంగా వేద పరీక్షలు ఎలా ఉండాలంటే, అభ్యర్థులను అడిగే ప్రశ్నలు ఒకటికి నాలుగు అడగాలి. వాళ్లు బాగా చెప్తేనే ఉంచాలి. లేకుంటే తీసేయాలి. కానీ, వేదంలో రాయడం లేనే లేదు. దేశంలో ఎక్కడా లేదు. పరీక్షలు మౌఖికం. వినడం, చెప్పడం ద్వారా రక్షించబడిన విద్య ఇది. తెలంగాణ ప్రాంతంలో సహృదయులైన వేదపండితులకు లోటే లేదు. పాఠశాల నిర్వాహకులను పరీక్ష నిర్ణయాధికారులుగా పెడితే అభ్యర్థులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
– శశిభూషణ సోమయాజి, విద్యారణ్యం వేదపాఠశాల
వేదపారాయణానికి, రాతపరీక్షలకు సంబంధమే లేదు. సాధారణంగా వేదపారాయణంవారు చేసే విధులకు రాత అవసరం లేదు. అడ్మినిస్ట్రేషన్ సందర్భంలో తప్ప వేదపారాయణలో అసలు రాతే ఉండదు. ఉదయం నుంచి పూజాది కార్యక్రమాలు తదితరాలు తప్ప ఎక్కడా రాతతో సంబంధమే లేదు. వేదపారాయణదారుల ఎంపికలో మౌఖికంగానే చేస్తాం. కానీ, క్రమం, ఝట, ఘన లాంటివి రాయడం కష్టం. కానీ, మేం వేదపాఠశాలలోకి విద్యార్థులను తీసుకునే సమయంలో వారిని ఏడెనిమిది ఏండ్ల వయసులో తీసుకుంటాం. వారికి రాయడం చాలా తక్కువగా ఉంటుంది. వేదం కేవలం మౌఖికంగా నేర్పిస్తాం. వేదపారాయణానికి, రాతకు అసలు సంబంధమే ఉండదు. దేవాదాయ శాఖ పరీక్షల్లో తమవారిని ఎంపిక చేయాలనే దృక్పథంలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి లోపభూయిష్టమైన విధానాలు పెడుతారు.
– కేదారనాథ్ ఘనాపాఠి, శ్రీరాజరాజేశ్వర సాంగ వేదవిద్యాలయం
వేదానికి రాత లేనే లేదు. వేదంతోపాటుగా ఉన్న కావ్యాలకు రాత ఉంటుంది. సంహిత మూల పరీక్షల్లో ఎక్కడా రాత పరీక్ష ఉండదు. వేదం అంటేనే మౌఖికం. యూనివర్సిటీ స్థాయిలో వేదంతోపాటుగా టీటీడీ వాళ్లు ధర్మగిరిలో పెట్టే పరీక్షల సమయంలో వేద విభాగాన్ని కంఠస్థంగా చేస్తారు. వేదానికి అంగాలను రాతపరీక్షలుగా నిర్వహిస్తారు. అందులోనూ మూడు సబ్జెక్టులను ఇచ్చి వాటిలో రాత పరీక్షలు పెడుతారు. అదే సమయంలో స్థానాచార్య పోస్టుకు రాతపరీక్ష ఉంటుంది. ఆగమాలను బట్టి వారికి అందులోని విధివిధానాలపై పరీక్ష పెట్టడం సాధారణం. కానీ, స్వర విభాగానికి సంబంధించిన వేదపరీక్షలో సంహిత, మూలం, క్రమం, ఘనం అని ఉంటుంది. వాటికి కచ్చితంగా మౌఖిక పరీక్ష మాత్రమే ఉంటుంది. మేము గతంలో వేదపారాయణం కోసం పరీక్షలు ఇచ్చినప్పుడు రాత పరీక్ష లేనేలేదు. కంఠస్థంగా మాత్రమే పరీక్ష పెట్టారు.
-సాయికిరణ్ ఘనాపాఠి, రుగ్వేద పండితులు