హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై తాత్సారం చేస్తూ.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ చెప్పి తప్పించుకు తిరుగుతున్న ఆర్టీసీ యాజమాన్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇచ్చిన సమ్మె నోటీసుకు గడువు దగ్గర పడుతుండటంతో.. ఒక్కసారి కూడా చర్చలకు రాకపోవడంపై మండిపడింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి చర్చలు జరపాలని కార్మిక సంఘాలు ఇటు లేబర్ కమిషనర్‌ను, అటు ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నాయి.
ఈ క్రమంలో కార్మిక సంఘాలకు మద్దతుగా లేబర్ కమిషనర్ రెండుసార్లు ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చలకు ఆ హ్వానించారు. ఆర్టీసీ యాజమాన్యం స్పందించలేదు. దీంతో మూడో దఫా చర్చలకు ఆహ్వానించమని కార్మికులు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్లడంతో.. వారు ఎన్నికల కోడ్ ఉందని చెప్పారు. ఈ విషయంపై యాజమా న్యం లేబర్ కమిషనర్‌కు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. సమ్మె తేదీ దగ్గర పడుతుండటంతో ఇరుపక్షాలు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో చేసేది లేక ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎన్నికల కమిషన్‌ను కలిసి గోడును వినిపించాయి.
ఎన్నికల కోడ్ పేరుతో కార్మిక సంఘాలను ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. హైదరాబాద్‌లోనే చర్చలు జరపాలనే రూల్ ఏమైనా ఉందా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో కాకపోతే మరో జిల్లాలో పెట్టొచ్చు కదా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఇచ్చిన సమ్మె నోటీసుపై అటు లేబర్ కమిషనర్, ఇటు ఆర్టీసీ యాజమాన్యం కచ్చితంగా స్పందించాల్సిందేనని ఆదేశించినట్టు సమాచారం.
అటు ఆర్టీసీకి గానీ, ఇటు లేబర్ కమిషనర్‌కు గానీ దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. సమ్మె గడువు ముగిసేలోపు లేఖల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తంచేయాలని సూచించింది. ఎన్నికల కమిషన్ కూడా తమపై సుముఖత వ్యక్తం చేయడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ, లేబర్ కమిషనర్.. ఎవరు స్పందించినా, స్పందించకపోయినా సమ్మె విషయంలో ఈ నెల 7న అన్ని ఆర్టీసీ సంఘాలు సమావేశమై సమ్మె తేదీని ప్రకటిస్తామని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.