హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రామోజీ గ్రూపు సంస్థల జేబు నింపేందుకు రాష్ట్ర విద్యాశాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీకి ఆదాయం సమకూర్చేలా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సందర్శించాలని, ఒక్కో విద్యార్థి వెయ్యి రూపాయలు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గురువారం ఆదేశాలివ్వడం కొత్త వివాదానికి తెర లేపింది. ఫిల్మ్‌సిటీ సందర్శనకు హెచ్ఎంలు ప్రత్యేకంగా స్కూల్స్ బుకింగ్ చేసుకోవాలని, ఈ నెల 21 నుంచి జనవరి 2 వరకు కాకుండా, మిగతా రోజుల్లో మాత్రమే వెళ్లాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థను సందర్శించాలంటూ ఉత్తర్వులివ్వడమంటే సంస్థను ప్రమోట్ చేయడమే అవుతుందని విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ప్రైవేట్ వ్యాపారానికి ప్రభుత్వం ఎలా అధికారికంగా మద్దతు పలుకుతుందని టీచర్లు నిలదీస్తున్నారు.
చాలా కాలంగా విజ్ఞాన విహారయాత్రలకు విద్యాశాఖ అనుమతినివ్వడం లేదు. హెచ్ఎంలు డీఈవోలకు దరఖాస్తు చేస్తే పట్టించుకోవడం అటుంచి, కనీసం కొన్ని జిల్లాల్లో అయితే దరఖాస్తులనే స్వీకరించడం లేదు. ఈ క్రమంలోనే కొందరు హెచ్ఎంలు దొంగచాటుగా విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రలకు తీసుకెళ్తున్న విషయం తెలుసుకుని తమ అనుమతి లేకుండా విద్యార్థులను బడి బయటికి తీసుకెళ్ల వద్దని సాక్షాత్తు విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. విద్యార్థులను బయటకు తీసుకెళ్లిన సందర్భంలో ఆటో ప్రమాదం జరిగి, పలువురు గాయాలపాలైన ఘటనతో ఉత్తర్వులిచ్చినట్టు విద్యాశాఖే ప్రకటించింది. ఉత్తర్వులు వెలువడి నెల కూడా గడవకముందే తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శన కోసం స్పెషల్ అనుమతినివ్వడమేంటని టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు వెయ్యి రూపాయల టికెట్ కొనగలరా అని ప్రశ్నిస్తున్నారు. టికెట్ చార్జీలకు అదనంగా రవాణా, టిఫిన్లు, భోజనాల ఖర్చులు స్టూడెంట్స్ ఎలా సమకూర్చుకుంటారని నిలదీస్తున్నారు. కాగా, విజ్ఞాన విహారయాత్రల కోసం సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా సైన్స్ మ్యూజియం, జూపార్క్, గోల్కొండ కోట వంటివి ఉండగా, ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించాలని ఉత్తర్వులివ్వడంపై అంతా పెదవి విరుస్తున్నారు. భవిష్యత్తులో మరికొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యాపారం కోసం ఆశ్రయిస్తే ప్రభుత్వం వాటికి కూడా అనుమతి ఇస్తుందా.. అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అర్థం లేని ఇలాంటి ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.