హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): ప్రమాదకర గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్‌ను తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీలో ఈ తీర్మానాని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారాక్వాట్ వినియోగంతో రైతులు, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ గడ్డి మందు కారణంగా ప్రతియేటా వందల సంఖ్యలో రైతులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్ర అసెంబ్లీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి విజ్ఞప్తిచేశారు.
ఈ తీర్మానంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ గడ్డి మందు వల్ల రైతులు, యువత ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నదని, దీన్ని నిషేధించాలని కోరుతూ రెండు నెలలుగా గళమెత్తుతున్నానని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తన పోరాటానికి దక్కిన ఫలితమని అన్నారు.
గడ్డి మందును నిషేధించాలని గత ఫిబ్రవరి 21న తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ ద్వారా డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. మార్చి 3న అఖిల పక్షం సహా ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌తో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ గడ్డి మందు దుష్పరిణామాలను తెలియజేయడంతో పాటు దీన్ని నిషేధించాలని కోరినట్టు తెలిపారు.