Telangana | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్‌ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి. మే నెల మొదటి వారంలోనే కొన్ని ప్రధాన శాఖల హెచ్వోడీలు, జిల్లా కలెక్టర్ల బదిలీలు జరుగుతాయని, జాబితా కూడా సిద్ధమైందని సీఎంవో నుంచే లీకులు వచ్చాయి. కొత్త సీఎస్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఐఏఎస్‌ల బదిలీలు ఇక లాంఛనమే అనే ప్రచారం జరిగింది. తెరవెనుక ఏం జరిగిందో ఏమో గానీ ఐఏఎస్‌ల బదిలీలకు బ్రేక్ పడింది. మరోవైపు బదిలీ తప్పదనుకున్న అధికారులు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా వదిలేసినట్టు జిల్లా యంత్రాంగంలో చర్చ జరుగుతున్నది.
సీఎం వర్సెస్ మంత్రులు
సీఎం, మంత్రుల మధ్య నెలకొన్న అగాధమే ఐఏఎస్‌ల బదిలీల బ్రేక్‌కు కారణం అని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో సీఎంవో కసరత్తు చేసినట్టు తెలిసింది. తమ ఆధీనంలో ఉండి పనిచేసే కలెక్టర్లను ఏరి కోరి పోస్టింగుల్లో సర్దుబాటు చేసినట్టు, రాష్ట్రంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా.. క్షణాల మీద సీఎంవోకు సమాచారం చేరవేసేంత విధేయత ఉన్న అధికారులతో జాబితా రూపొందించినట్టు సమాచారం. ఈ జాబితాకే సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ జాబితాలోని పేర్లు బయటికి పొక్కడంతో మంత్రులు తీవ్ర ఆభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ ప్రమేయం లేకుండా కలెక్టర్ల పోస్టింగు మీద ఎలా నిర్ణయం తీసుకుంటారని వారు ఎదురుతిరిగినట్టు తెలిసింది. దక్షిణ తెలంగాణలోని ఒక కలెక్టర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ బదిలీల జాబితాలో సదరు వ్యక్తి పేరు లేకపోవడంతో అక్కడి నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
15 జిల్లాల కలెక్టర్ల మీద నేతల ఫిర్యాదు
ప్రస్తుతం 15 జిల్లాల కలెక్టర్ల మీద మంత్రులు, ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ ఫిర్యాదుల ఆధారంగానే సీఎంవో ఈ 15 మందితోపాటు, 12 మంది అదనపు కలెక్టర్లను, 10 మంది జాయింట్ కలెక్టర్లను బదిలీ చేస్తూ లిస్టు ఫైనల్ చేసినట్టు సమాచారం. నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న సీఎంవో.. వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా జాబితా రూపొందించినట్టు ప్రచారం జరుగుతున్నది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురు తిరిగినట్టు సమాచారం. ఈ పరిస్థితిపై డోలాయమానంలో పడిన సీఎం ఇప్పటికే ఉన్న విభేదాలు మరింత పెరుగుతాయేమోనన్న ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. పోనీ మంత్రులు సూచించిన పేర్లతో బదిలీలు చేస్తే పాలనా వ్యవస్థ చేజారిపోతుందమోనని సీఎంవో భావిస్తున్నట్టు సమాచారం. సదరు అధికారులు తన మాట కాకుండా మంత్రుల మాటకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంటుందని, అప్పుడు మరింత ఇబ్బంది ఏర్పడుతుందనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.
జిల్లాల సర్దుబాటుతో సమస్య కొలిక్కి..
ఆయా మంత్రుల అభిప్రాయం మేరకు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎంవో సూచించిన బదిలీలతో తుది జాబితా రూపొందించినట్టు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, ఖమ్మం తదితర జిల్లాల కలెక్టర్ల బదిలీలపై క్లారిటీ వచ్చినట్టు సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో ఇద్దరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కరు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఒకరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున కలెక్టర్లు, ఆ కింది స్థాయి అధికారులు బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. జూన్ 6 లోపు కలెక్టర్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని, ఇప్పుడు బదిలీ చేస్తే మళ్లీ ఏడాది, ఏడాదిన్నర వరకు ట్రాన్స్ఫర్ల జోలికి వెళ్లకుండా.. పూర్తిగా పాలనపైనే ఫోకస్ పెట్టే విధంగా కసరత్తు ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది.