హైదరాబాద్, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనుల కోసం ఇంజినీర్లు, వివిధ ఏజెన్సీల మధ్య కో ఆర్డినేషన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. సొరంగ పనుల భద్రత ప్రభుత్వ సలహాదారు కల్నల్ పరీక్షిత్ మెహ్రా చైర్మన్‌గా, రామగుండం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రావు గుప్తా మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. జాయింట్ సెక్రటరీ(టెక్నికల్) కే శ్రీనివాస్, సీడీవో సీఈ ఎంఎస్ఎన్ రెడ్డి, సీడబ్ల్యూపీఆర్ఎస్ అడిషనల్ డైరెక్టర్ సెల్వబాలన్, ఆఫ్రీ ఇండియా లిమిటెడ్ ఎండీ సాయికృష్ణ, ఎల్అండ్టీ జీఎం సురేశ్‌కుమార్, ఆఫ్కాన్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, నవయుగ ప్రాజెక్టు మేనేజర్ మాధవ్‌ను మెంబర్లుగా నియమించింది. మొత్తంగా 9 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా కమిటీకి పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ మే 30వ తేదీలోగా సాంకేతిక పరీక్షలు నిర్వహించేందుకు రోజువారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, అదేవిధంగా రోజువారీగా ప్రగతి నివేదికలను సమర్పించాలని ఆదేశించింది. ప్రధానంగా నిర్మాణ, సాంకేతిక పరీక్షల నిర్వహణ ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ ఎన్డీఎస్ఏ, సీడబ్లూసీ నుంచి కావాల్సిన అనుమతులను తీసుకోనే బాధ్యత కో ఆర్డినేషన్ కమిటీదేనని వెల్లడించారు. ప్రతి సోమవారం, గురువారం పరీక్షల పూర్తి నివేదికలను సమర్పించాల్సి ఉంటుందని కమిటీని సర్కార్ ఆదేశించింది.
కాళేశ్వరం కోసం కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటుపై ఇంజినీర్వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది. అందుకోసం సీనియర్ ఆఫీసర్లు, సాంకేతిక నిపుణులను నియమించకుండా.. సర్కార్ కో ఆర్డినేషన్ కమిటీని నియమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఎస్ఎల్బీసీ సొరంగ పనుల మరమ్మతుల కోసం ప్రభుత్వం కల్నల్ పరీక్షిత్ మెహ్రాను సలహాదారుగా నియమించుకున్నది. సొరంగ పనుల నిర్మాణం, భద్రతలో ఆయన నిపుణులు. కానీ తాజాగా ఆయననే బరాజ్‌ల పునరుద్ధరణ పనుల కోసం నియమించిన కమిటీకి చైర్మన్‌గా నియమించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదీగాక నిర్మాణ పనుల పర్యవేక్షణ ఇతరత్రా వాటి కోసం ఈఎన్సీ స్థాయి, లేదంటే బరాజ్ నిర్మాణాల్లో సీనియర్ సాంకేతిక నిపుణులను నియమిస్తారు.
కానీ కమిటీలో ఒక్క ఈఎన్సీని సైతం ఏర్పాటు చేయలేదు. అవసరమైతే ఏర్పాటు చేస్తామంటూ సర్కార్ చేతులు దులుపుకొన్నది. మరోవైపు ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొంటున్న ఓ ఇంజినీర్‌ను నియమించడంపై ఇరిగేషన్ వర్గాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. సీనియర్ ఇంజినీర్లను కాదని ఇప్పటికే అడ్డదారిలో ఈఈ నుంచి ఎస్ఈగా ప్రమోషన్ పొందారనేది సదరు ఇంజినీర్‌పై విమర్శలున్నాయి. అదీగాక కీలకమైన జాయింట్ సెక్రటరీ(టెక్నికల్) పోస్టును చీఫ్ ఇంజినీర్ అధికారితో నియమించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సీనియర్లను పక్కకు పెట్టిమరీ ఎస్ఈ హోదాలో ఉన్న సదరు ఇంజినీర్ కే శ్రీనివాస్‌నే జాయింట్ సెక్రటరీగా నియమించింది. దీనిపై ఇంజినీర్ వర్గాలు ఇప్పటికే తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నాయి.
అయినప్పటికీ ప్రభుత్వం తాజాగా నియమించిన కీలకమైన కో ఆర్డినేషన్ కమిటీలోనూ ఇన్చార్జి హోదాలో కొనసాగుతున్న సదరు జూనియర్ ఇంజినీర్‌ను మెంబర్‌గా నియమించడం గమనార్హం. ఇక మిగిలిన మెంబర్లుగా కూడా నిర్మాణ ఏజెన్సీల ప్రతినిధులనే నియమించింది. మొత్తంగా కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటులో సర్కార్ తీరును చూసి ఇంజినీర్లు సర్వత్రా విమర్శిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వానకాలం నాటికి సాంకేతిక పరీక్షలు పూర్తి చేస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బరాజ్‌ల మరమ్మతులపై ఎన్డీఎస్ఏ ఇటీవల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్‌తో ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బరాజ్‌ల రిపేర్లు, పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికను వివరించారు. అన్ని కోణాల్లో నిపుణుల ఆధ్వర్యంలో ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సంస్థలు డిజైనింగ్, టెస్టింగ్ సంస్థలు రంగంలోకి దిగాయని, సీడబ్ల్యూపీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీపీఆర్(గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్ తదితర సాంకేతిక పరీక్షలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం ప్రభుత్వం సెంట్రల్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక పరీక్షల ఫలితాలను విశ్లేషించి, నిర్మాణ లోపాలు గుర్తించి, అందుకు అనుగుణంగా పునరుద్ధరణ పనుల డిజైన్లు సిద్ధం చేసి, ఎన్‌డీఎస్‌కు పంపి సూచనలు తీసుకుంటామని వెల్లడించారు. వానకాలం ముందే పరీక్షలు పూర్తిచేసి, అనంతరం పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు రెండున్నరేండ్లు గడువు ఇచ్చి ఎలాంటి ఆందోళనలు చేయకుండా ఉన్న గులాబీ దండు మౌనం వీడింది. ‘రైతులకు కల్పతరువులాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకురావాలి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై మీ కుట్రలు ఆపండి .. ముంచుకొస్తున్న కరువు నుంచి రైతులను ఆదుకోండి’ అంటూ బీఆర్ఎస్ నాయకులు శనివారం మేడిగడ్డ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు.
ఈ నెల 20న సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రానుండగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ‘ఎన్నిసార్లు ప్రాజెక్టు సందర్శనకు వస్తావు.. మీ శాఖ మంత్రి , ఇరిగేషన్ అధికారులు ఇక్కడి పరిస్థితులు చెప్పడం లేదా.. వస్తే గిస్తే మరమ్మతు పనులను ప్రారంభించడానికి రండి.. అనవసర కాలయాపనతో రైతులు నష్టపోతున్నారు’ అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినితో పాటు పార్టీ శ్రేణులు శనివారం ఉదయం 10 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు.