Gurukula Schools | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయకముందే, సెకండియర్ సిలబస్‌ను బోధించాలని, అందుకు మైక్రో షెడ్యూల్‌ను కూడా ఖారారు చేసి జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వింత పోకడలపై సీఈవోల్లోని సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 38 సీవోఈలు ఉన్నాయి. అందులో విద్యార్థులకు ఇంటర్ విద్యతోపాటు సమానంగా జేఈఈ, నీట్ పరీక్షలకు సైతం శిక్షణ అందిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యేవరకూ సదరు విద్యార్థులకు ఫస్టియర్ సబ్జెక్టు రివిజన్లు, మాక్ టెస్ట్‌లు నిర్వహించడం పరిపాటి. ఫస్టియర్ పరీక్షలు రాసిన అనంతరం సెకండియర్ సిలబస్ బోధించడం ఆనవాయితీ.
ఇంటర్ పరీక్షలు మార్చి5 నుంచి కొనసాగనున్నాయి. దాదాపు 2 నెలల సమయముంది. వాస్తవంగా సొసైటీలోని సీవోఈల్లో ఇంకా ఫస్టియర్ గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సిలబస్ పూర్తి కాలేదు. కానీ సొసైటీ ఉన్నతాధికారులు మాత్రం జనవరి 1 నుంచే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సెకండియర్ సిలబస్‌ను బోధించడం ప్రారంభించాలని హుకూం జారీ చేశారు. అంతేకాదు సబ్జెక్టులవారీగా ఫిబ్రవరి 2 వరకు మైక్రోషెడ్యూల్ను కూడా ఖరారు చేయడం గమనార్హం.
ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలకు సంసిద్ధం కావలసిన సమయంలో విద్యార్థులకు సెకండియర్ పాఠాలు బోధించడంపై టీచర్లు మండిపడుతున్నారు. కార్పొరేట్ కాలేజీల తరహాలో సొసైటీ వ్యవహరిస్తున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇది అంతిమంగా పిల్లలపై మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే గురుకులాల్లో విద్యార్థుల అత్మహత్యలు ఆందోళన రేకేత్తిస్తున్నాయని, అయినప్పటికీ సొసైటీ ఉన్నతాధికారులు ఏమాత్రం గుణపాఠాలు నేర్వకుండా, అనాలోచిత, అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకోవడం సరికాదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల్లో ప్రతి మూడేండ్లకోసారి ఫీజులు పెంచే అవకాశముంది. ఈ లోపు ఫీజులు పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఫీజులపై కసరత్తు చేస్తున్న తెలంగాణ విద్యాకమిషన్ శుక్రవారం తల్లిదండ్రుల సంఘాలతో చర్చలు జరిపింది. సైఫాబాద్‌లోని పాఠశాల డైరెక్టరేట్ కార్యాలయంలో విద్యా కమిషన్ 30 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.