జగిత్యాల, డిసెంబర్ 9 : కనిపెంచిన తల్లిపై నలుగురు కొడుకులు కర్కశత్వం చూపిన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు. మూడోవాడైన శ్రీనివాస్ వద్ద రాజవ్వ ఉంటున్నది. 12 రోజుల క్రితం శ్రీనివాస్ తల్లిని ఆటోలో జిల్లా కేంద్రంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకొచ్చాడు. సొంతంగా గది చూస్తానని.. అప్పటివరకు ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. రాజవ్వకు కాలునొప్పి తగ్గకపోవడంతో అక్కడే కూర్చొని రోదిస్తున్నది. ఓ కార్యక్రమం కోసం శ్మశానానికి వచ్చిన స్థానిక మహిళలకు రాజవ్వ ఏడుస్తూ కనిపించడంతో విషయం బయటకు వచ్చింది. జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్ చేరుకుని రాజవ్వను దవాఖానలో చేర్పించారు. తర్వాత సఖీ కేంద్రానికి తరలించి, కొడుకులకు కౌన్సెలింగ్ ఇవ్వగా శ్రీనివాస్ ఇంటికి తీసుకెళ్లాడు. సోమవారం రెండోసారి రాజవ్వను శ్మశాన వాటికలో వదిలివేయడంతో భిక్కుభిక్కుమంటూ రోదిస్తూ కూర్చున్నది. కొడుకులపై కేసు నమోదు చేసి శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.