హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ను కూడా ఎన్నుకుంటారు. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తిచేశారు. ఇప్పటికే ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అన్నింటినీ సిద్ధం చేసి ఉంచారు. ఏజెంట్ల సీటింగ్, సీక్రెట్ పోలింగ్ కంటెయినర్ ఏర్పాట్లను పూర్తిచేశారు. వెబ్‌కాస్టింగ్‌కు అంతా సిద్ధం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ప్రాంతాలు మినహా 3,769 పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు.
ఈ వెబ్‌కాస్టింగ్‌ను మూడుచోట్ల నుంచి ఎన్నికల అధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎస్ఈసీ కార్యాలయం నుంచి కమిషనర్, జిల్లా కేంద్రాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ సరళిని వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. రెండో విడత పోలింగ్ కోసం 4,593 మంది రిటర్నింగ్ అధికారులను, 30,661 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల అధికారులు నియమించారు. ఈ విడత కూడా మొత్తం 2,489 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటుచేశారు. 46,026 బ్యాలెట్ బాక్సులు ఈ ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు.
రెండో విడతలో మొత్తం 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. రెండు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,911 గ్రామాల్లో ఆదివారం పోలింగ్ జరుగుతుంది. ఆయా పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 12,782 మంది పోటీలో ఉన్నారు.
రెండో దఫాలో మొత్తం 57,22,665 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,96,006 పురుషులు, 29,26,306 మంది మహిళలు ఉండగా, మరో 153 మంది ఇతరులు ఉన్నారు. మొత్తం 38,350 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా, 71,071 మంది పోటీలో ఉన్నారు. రెండో విడత ఎన్నికల కోసం 38,337 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు.
మలి విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు అభ్యర్థులు తాయిలాలను పంచిపెట్టారు. చివరి రెండురోజులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా మద్యం, చికెన్, మటన్ పంపిణీ చేశారు. ఈ రెండు రోజుల్లోనే రాత్రి వేళల్లో విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేశారు. ఒక్కో గ్రామాల్లో ఒక్కో విధంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ప్రలోభాల పంపిణీ జరిగింది. ఒక అభ్యర్థి ఓటుకు రూ.500 ఇస్తే, మరో అభ్యర్థి ఓటుకు రూ.1,000 చొప్పున ఇచ్చినట్టు సమాచారం. ఒక్క ఓటుకు క్వార్టర్ మద్యం పంచితే, మరొకరు హాఫ్ బాటిల్ మద్యం అందించినట్టు తెలిసింది. సర్పంచ్, వార్డుల అభ్యర్థులు కొన్నిచోట్ల ఉమ్మడిగా, మరికొన్ని చోట్ల వేర్వేరుగా పంచిపెట్టారు. ఇంకొందరు నేరుగా ఓటర్ల ఫోన్‌నంబర్లు తీసుకొని రూ.500, రూ.1,000 చొప్పున ఫోన్‌పే, గూగుల్ పే చేస్తున్నారు. కొన్నిచోట్ల ఓటుకు రూ.2,000 చొప్పున పంచినట్టు సమాచారం. ఇటు ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనని విమర్శలు వస్తున్నాయి.
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులకు బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు ముచ్చెమటలు పట్టించారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో పెద్ద ఎత్తున గులాబీ జెండాను ఎగురవేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, నల్లగొండ జిల్లా అయిటిపాముల మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు అత్యధిక మెజా రిటీతో గెలుపే నిదర్శనం. ఏటూరు నాగారంలో 3,230 ఓట్లతో కాకులమర్రి శ్రీలత, అయిటిపాములలో 1,526 ఓట్ల మెజారిటీతో బెల్లి సుధాకర్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులపై ఘన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మేజర్ పంచాయతీల్లో ఇదే తరహాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులపై గులాబీ సేనలు విజయదుందుభి మోగించాయి. రెండో విడతలోనూ బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల హవా ఉంటుందని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. గ్రామీణ ప్రజలు అధికార కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తొలి విడత ఫలితాలతో తేటతెల్లమైంది. పింఛన్లు పెంచకపోవడం, తులంబంగారం ఇవ్వకపోవడం, రైతు భరోసా, వడ్లకు బోనస్, మహిళలకు 2,500 వంటి హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పాలనపై పల్లె ప్రజలు గుర్రుగా ఉన్నారనే విషయం వెల్లడైంది.
తుది విడత పంచాయతీలకు ఈ నెల 17న పోలింగ్ జరుగుతున్నది. దీంతో 15న సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగియనున్నది. ఈవిడతలో 3,752 సర్పంచ్ స్థానాలకు 12,640 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒక్కో సీటు కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. ప్రచారానికి ఇక రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులు జోరు పెంచారు. దూరప్రాంతాల్లో ఉన్నవారిని సైతం ఓటింగ్ రోజు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు రోజూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చిన నాటి నుంచి శనివారం వరకు రూ.8.59 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఈసీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 912 లైసెన్స్డ్ ఆయుధాలను, రూ.2,02, 84,590 నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. రూ.3.46 కోట్ల విలువైన మద్యం, రూ.2.28 కోట్ల విలువైన రూ.2.28 కోట్ల డ్రగ్స్, రూ.12.15 లక్షల ఆభరణాలు, రూ.69.16 లక్షల ఇతర వస్తువులను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన కింద 3,675 కేసులు నమోదు చేశామని తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ల కింద 33,262 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు.
ఎన్నికలు జరిగే జిల్లాలు: 31
మండలాల సంఖ్య: 193
నోటిఫికేషన్ ఇచ్చిన జీపీలు: 4,333
నామినేషన్లు రాని జీపీలు: 5
ఏకగ్రీవమైన జీపీలు: 415
ఎన్నికలు నిలిచిన జీపీలు: 2
పోలింగ్ జరిగే జీపీలు: 3,911
సర్పంచ్ అభ్యర్థులు: 12,782
నోటిఫికేషన్ ఇచ్చిన వార్డులు: 38,350
నామినేషన్లు రాని వార్డులు: 108
ఏకగ్రీవమైన వార్డులు: 8,307
ఎన్నికలు నిలిచిన వార్డులు : 18
పోలింగ్ జరిగే వార్డులు: 29,917
పోటీలో ఉన్న అభ్యర్థులు: 71,071
పోలింగ్ స్టేషన్ల సంఖ్య : 38,337
మొత్తం ఓటర్ల సంఖ్య: 57,22,665
పోలింగ్ జరిగే తేదీ: డిసెంబర్ 14