హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 27 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లకు(యూఆర్ఎస్) పక్కా భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. ఒక్కో యూఆర్ఎస్కు 4 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు.
రాష్ట్రంలో మొత్తం 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా, ఒకదానికి సొంత భవనం ఉంది. మరొకటి నిర్మాణంలో ఉంది. మిగిలిన 27లో 21 యూఆర్‌ఎస్‌లు సర్కారు బడుల్లో నడుస్తున్నాయి. మరో 6 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిల్లో వీధి బాలలు, అనాథలు, రెస్క్యూ చేసిన పిల్లలు, బాల కార్మికులు, పరారై చిక్కిన చిన్నారులను చేర్చుకుని విద్యనందిస్తున్నారు.
16మంది పర్యవేక్షణాధికారుల నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల మానిటరింగ్‌కు 16మంది పర్యవేక్షణాధికారులను పాఠశాల విద్యాశాఖ నియమించింది. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లకు రెండు, మూడు జిల్లాలకు పర్యవేక్షణాధికారులుగా బాధ్యతలు అప్పగించింది.