హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మాడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష రద్దుచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి గురుకుల సెట్ ద్వారా మాడల్ స్కూల్స్‌లోని సీట్లు భర్తీచేయాలని నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లున్నాయి. వీటిల్లో 6వ తరగతి ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇక 7-10వ తరగతి వరకు ఖాళీల భర్తీతోపాటు, 6వ తరగతి కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. గురుకులాల హవా, మాడల్ స్కూల్స్ కోసం ప్రత్యేక పరీక్ష ఉండటంతో వీటిల్లో విద్యార్థులు చేరడంలేదు. ఈ ఏడాది 40వేలకు పైగా సీట్లు నిండలేదు.
గతంలోనూ భారీగానే సీట్లు మిగిలాయి. దీంతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష అవసరంలేదన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. అయితే గురుకుల సెట్‌తో అడ్మిషన్లు చేపట్టాలంటే చిన్న అడ్డంకి ఎదురయ్యింది. గురుకుల సెట్ ద్వారా 5వ తరగతిలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. కానీ మాడల్ స్కూల్స్‌లో 6వ తరగతి నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాడల్ స్కూళ్లల్లో కొత్తగా ఐదో తరగతి ప్రవేశపెట్టాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మాడల్ స్కూల్స్‌లో ఐదో తరగతి ప్రవేశ పెట్టేందుకు, గురుకుల సెట్‌తో అడ్మిషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇక నుంచి మాడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష ఉండదు. గురుకుల సెట్ ద్వారానే మాడల్ స్కూల్స్‌లోని సీట్లు భర్తీచేస్తారు.