హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తేతెలంగాణ): ‘లగచర్లలో గిరిజన రైతుల హక్కుల హననం జరిగింది. ఇందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదికే సాక్ష్యం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. లగచర్ల గిరిజన రైతులు, మహిళలపై కాంగ్రెస్ సర్కారు ఆదేశాల మేరకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఇంతకాలం తాము చెప్తున్న విషయాలు ఈ నివేదికతో బట్టబయలయ్యాయని సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. వాస్తవాలతో నివేదిక ఇచ్చిన ఎన్హెచ్ఆర్సీకి కృతజ్ఞతలు తెలిపారు.
అధికారంలో ఉన్నవారు చట్టానికి అతీతులు కాదనే హెచ్చరికను పంపిందని చెప్పారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన సోదరీ సోదరమణులకు ఇది గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. ఎన్హెచ్ఆర్సీ నివేదికతోనే సీఎం రేవంత్రెడ్డి కండ్లు తెరిచి లగచర్ల రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి మాత్రమే కాదని, హోమంత్రి కూడా అనే విషయాన్ని మరిచిపోవద్దని చురకలంటించారు.