(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మరోసారి కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు తగిన ధరను ఇవ్వకపోవడంపై గళమెత్తారు. ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ) కింద చెరుకు పంటకు క్వింటాల్‌కు కేవలం 10 రూపాయలనే పెంచడంపై చెరుకు రైతులు మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అనుబంధ సంస్థ ఆలిండియా షుగర్‌కేన్ ఫార్మర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్ఎఫ్) ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 20న జాతీయ నిరసన దినంగా పాటిస్తూ.. షుగర్ మిల్స్ ముందు లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు చెరుకు రైతులతో ధర్నా నిర్వహిస్తామని వివరించింది.
మోదీ సర్కారు చెరుకు రైతులను అన్యాయం చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ఎఫ్ ప్రతినిధులు మండిపడ్డారు. గడిచిన ఐదేండ్లలో క్వింటాల్ చెరుకు ధరను రూ. 275 నుంచి రూ. 315కు పెంచారని, అంటే ఈ లెక్కన ఐదేండ్లలో క్వింటాల్ చెరుకు ధర కేవలం రూ. 40 మాత్రమే పెరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఎఫ్ఆర్పీ కింద క్వింటాల్‌కు రూ. 10 మాత్రమే పెంచడమేంటని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం కారణంగా పంట పెట్టుబడి వ్యయం పెరిగిందని.. దానికి అనుగుణంగా ఎఫ్ఆర్పీని కూడా పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినట్టు క్వింటాల్ చెరుకుకు ఎఫ్ఆర్పీని రూ.500గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. చెరుకు ఉప ఉత్పత్తులైన బగాసే, మొలాసిస్, ఇథనాల్ నుంచి వచ్చే ప్రధాన ఉత్పత్తుల ద్వారా వచ్చే లాభాల్లో తమకు వాటా ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణ ఆలోచనలను విరమించి, మూసేసిన మిల్స్‌ను వెంటనే తిరిగి తెరవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రైతుల నుంచి మిల్లుల యజమానులు చెరుకును కొనే మద్దతు ధరను ఎఫ్ఆర్పీ పేరిట కేంద్రమే నిర్ణయిస్తుంది. అయితే, ద్రవ్యోల్బణం కారణంగా ముడి సరుకు, ఎరువుల ధరలు పెరిగి పంట పెట్టుబడి గణనీయంగా పెరిగింది. దీనికి తగ్గట్టు.. కేంద్రం ఎఫ్ఆర్పీని ఆ స్థాయిలో పెంచట్లేదన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం క్వింటా చెరుకుకు రూ. 315ను ఎఫ్ఆర్పీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చాలా తక్కువ. తక్కువ ఎఫ్ఆర్పీ కారణంగా క్వింటా పంటకు ఒక్కో రైతు రూ. 123.5 వరకు నష్టపోతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, హర్యానాలోనే చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారు. కేంద్రం ఏకపక్ష విధానాలు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.