మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వల్లూరు, ఉదండాపూర్‌కు చెందిన ముంపు నిర్వాసితులు మూకుమ్మడిగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి డబ్బులు, ప్లాట్లు ఇచ్చిన తర్వాతే రిజర్వాయర్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం ఉదండాపూర్ రిజర్వాయర్‌తోపాటు నార్లాపూర్, వట్టెం రిజర్వాయర్ల పనుల పరిశీలనకు ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రానున్నారు.
మంత్రుల పర్యటనను అడ్డుకుంటారన్న అనుమానంతో పోలీసులు నిర్వాసితులను పోలీస్‌స్టేషన్‌కు రావాలని సీఐ ఆదిరెడ్డి సూచించారు. దీంతో వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరారు. తమకు ఎందుకు పిలిచారని ఆందోళన చేపట్టడంతో.. వారందరినీ ప్రభుత్వ గెస్ట్‌హౌస్ వద్దకు రావాలని పోలీసులు సూచించడంతో అక్కడికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పిన విధంగా మల్లన్నసాగర్ ముంపు బాధితులకు ఇచ్చిన ప్రకారం పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
గ్రామ కంఠంలో లేకుండా.. ఇతర భూముల్లో ఉన్న ఇండ్లకూ షరతుల్లేకుండా ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. పరిహారం చెల్లించాకే పనుల వద్దకు రావాలని సూచించారు. మంత్రుల పర్యటన విజయవంతం అయ్యేందుకు సహకరించాలని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వాసితులను కోరారు. సమస్యలుంటే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.