హైదరాబాద్, మే 16: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1980వ దశకంలో ఓ రాక్షసబల్లి అవశేషాలు దొరికాయి. ప్రాణహిత-గోదావరి లోయలో అన్నారం గ్రామానికి దక్షిణ దిశలో కిలోమీటర్ దూరంలో వీటిని గుర్తించారు. వీటిపై నిర్వహించిన పరిశోధనల ఫలితాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దీనిని బట్టి ఈ రాక్షసబల్లి దాదాపు 22.9-23.3 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉంటుందని వెల్లడైంది.
ఇది మాంసాహారి అని, అమెరికా వెలుపల ఈ జీవిని గుర్తించడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణహిత-గోదావరి లోయలోని మలేరీ ఘాట్ల వద్ద ఈ అవశేషాలు కనిపించాయి. మొదటిసారి దీనిని గుర్తించిన శాస్త్రవేత్త తారావత్ కుట్టి. అందువల్ల దీనికి మలేరీరాప్టర్ కుట్టి అని పేరు పెట్టారు.