Rythu Runa Mafi | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తించే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మార్గదర్శకాల్లో పేర్కొన్న రెండు నిబంధనలు ఉద్యోగులకు మొండి చెయ్యి చూపించనున్నాయి. రుణమాఫీలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, పీఎం కిసాన్ నిబంధనలను వీలైనంత మేరకు అమలుచేయాలని నిర్ణయించడంతో ఉద్యోగులను రుణమాఫీ దక్కదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది వర్కింగ్ ఉద్యోగులుండగా మరో 3 లక్షల మంది పదవీ విరమణ పొంది పెన్షన్ పొందుతున్నవారు ఉన్నారు.
ప్రభు త్వ ఉద్యోగులకు ఎలాగూ రేషన్‌కార్డు ఉండదు. రుణమాఫీ కోసం కుటుంబంలోని వ్యక్తులను లింకు చేయడానికి రేషన్‌కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్‌కార్డు లేకపోవడంతో వాళ్లు దీని పరిధిలోకి రారు. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం ఆ పథకానికి ప్రభుత్వ ఉద్యోగు లు అనర్హులు. వీరితోపాటు రూ.10 వేలకుపైగా పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా అనర్హులే. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు రుణమాఫీకి దూరమయ్యే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రుణమాఫీ గైడ్‌లైన్స్‌పై ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికలప్పుడు ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రేషన్‌కార్డు, పీఎం కిసాన్ అంటూ కొర్రీలు పెడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు మొండిచెయ్యి చూపడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ వ్యవసాయం చేసేవారు ఉన్నారని, పంట పెట్టుబడి కోసమే రుణం తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఉద్యోగులకూ రుణమాఫీ చేయాలి: సీపీఎస్ ఉద్యోగుల సంఘం
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా రుణమాఫీని వర్తింపచేయాలని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. పాలనలో ప్రభుత్వానికి ఎంతగానో సహకరిస్తున్న ఉద్యోగులను ఆహార భద్రతకార్డు, పీఎం కిసాన్ నిబంధనలతో రుణమాఫీకి దూరం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్నారని, ఇచ్చిన హామీ మేరకు అందరికీ రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.