Congress | మహబూబ్‌నగర్, జూన్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ ఓటమి చెందడానికి పార్టీలోని వర్గవిభేదాలే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తక్కువ ఓట్లతో వంశీచంద్‌రెడ్డి ఓటమికి సిట్టింగ్ ఎమ్మెల్యేలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థాగతంగా బలం లేని బీజేపీని ఓడించడం.. ఓటమి బాధతో ఉన్న బీఆర్ఎస్ను లెక్కలోకి తీసుకోకుండా ఇక గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు సెగ్మెంట్లు మినహా మిగతా వాటిలో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పార్టీ అభ్యర్థి ఓడిపోవడంపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో కొందరు ఎమ్మెల్యేలు కావాలనే ఓడించారని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకి వంశీ ఫిర్యాదు చేశారట. వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. వారికి రాబోయే రోజుల్లోనూ ఎలాంటి పదవులు ఇవ్వొద్దని సూచించారట. ఇదిలావుండగా ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని ప్రకటించడంతో బీసీ సామాజిక వర్గానికి గౌరవం దక్కుతుందని అంతా భావించారు. కానీ అదే నియోజకవర్గంలో బీజేపీకి భారీ లీడ్ రావడంతో మిగతా సామాజిక వర్గాల నేతలు ఎమ్మెల్యేకు మంత్రి పదవి వద్దని సూచిస్తున్నారట. దీంతో స్పందించిన ఎమ్మెల్యే వర్గం ఎదురుదాడికి దిగింది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారంటూ రెడ్డి వర్గంపై విరుచుకుపడింది. కాగా మరోవైపు అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దందాల్లో మునిగిపోయినట్టు సమాచారం. కొంతమంది ఇసుక దందా.. మరికొందరు మట్టిదందా.. చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేజిక్కించుకున్నారు. అంతేకాకుండా పైరవీలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలోని ఓ ఎమ్మెల్యే తన బంధువులతో ఏకంగా ఇసుక దందాకు తెరలేపారు. దీన్ని కొంతమంది నేతలు చెక్ పెట్టారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇక ఉమ్మడి జిల్లా కేంద్రంలో అయితే బీజేపీకి లీడ్ రావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అభివృద్ధిలో కలిసి పోదాం అంటూ చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇదంతా కావాలని కొందరు ఎమ్మెల్యేలు పనిగట్టుకొని పార్టీ అభ్యర్థిని ఓడించారనే ప్రచారం జోరందుకున్నది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పార్టీ ఎంపీ ఓడిపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏడు సెగ్మెంట్లలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉండి కూడా ఏ మాత్రం క్యాడర్ లేని బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక సీఎం కూడా సొంత జిల్లాలో కొంతమంది నేతలు హ్యాండిచ్చారని బాహాటంగా అంటున్నారు. రాష్ట్రంలో ఇతర చోట్ల భారీ మెజారిటీతో గెలిచినా.. సొంత జిల్లాలో మాత్రం కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో రాజకీయ విమర్శలు చెలరేగాయి. దీంతో ఇదంతా కొంతమంది నేతలు కావాలని బీజేపీకి మద్దతు ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.