హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ఘటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం నాలుగు రాష్ర్టాల్లోని 11 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. బ్లాస్ట్‌లో పాల్గొన్న ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నది. వీరిలో తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు ఇద్దరున్నారు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో పండ్ల వ్యాపారం పేరుతో తలదాచుకున్న పూణెకు చెందిన ఒకరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గంలో రిటైర్డ్ హెడ్మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయన ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉంటున్నారు. కొద్దిరోజులుగా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఉగ్రవాదులతో సంబంధాలుండొచ్చనే అనుమానంతో తనిఖీలు చేసిన అధికారులు చిన్నకుమారుడు సోహెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోహెల్ బ్యాంకు ఖాతాలో ఇటీవల అధిక మొత్తంలో నగదు జమ కావడంతో అతడి కుటుంబసభ్యులను విచారించారు. అనంతరం రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.