ప్రజల జాగృతాన్నే పరమావధిగా చేసుకొని.. ప్రజల తరఫున సర్కార్‌ను ప్రశ్నించే గొంతుగా నిలిచింది నమస్తే తెలంగాణ.. అడుగడుగునా అన్ని వర్గాల వారికి ఎదురవుతున్న అన్యాయాన్ని ఎదురించింది.. ప్రభుత్వ విభాగాల్లో వేళ్లూనుకున్న అవినీతిపై కలం ఝులిపించింది. కడు పేదలపై హైడ్రాతో విరుచుకుపడిన సర్కార్.. చెరువులు మింగి కట్టుకున్న పెద్దోళ్ల భవంతుల వైపు ఎందుకు చూడదని నిలదీసింది. ప్రజల రక్షకభటులైన కానిస్టేబుళ్లు, హోంగార్డుల ఆందోళనలకు మద్దతుగా నిలిచింది.. పోలీసుల ఆరోగ్యభద్రత, ఆత్మహత్యలపైనా గొంతెత్తింది. ఎవరెస్టు అంతటి కీర్తిని గడించిన తెలంగాణ గురుకులాలను ప్రభుత్వం గాలికొదిలేయడంపై తూర్పారబట్టింది. ఖజానా ఖాళీ అంటూ గగ్గోలు పెడుతూనే.. ప్రజల సొమ్మును దుబారా చేస్తున్న పాలకుల ద్వంద్వనీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టింది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై అక్షర సమరం సాగించింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు చాపకింద నీరులా జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటింది. జనసామాన్యంపై ఆర్టీసీ, మెట్రోరైలు చార్జీల బాదుడును వరుస కథనాలతో ప్రశ్నించింది నమస్తే తెలంగాణ.. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి మసకబారిన భాగ్యనగర క్షోభపై సర్కార్‌ను నిద్రలేపే ప్రయత్నం చేసిందీ నమస్తే తెలంగాణ.
కలికిమేడల వైపు కదలదేమీ సర్కార్?
కడు పేదలపై విరుచుకుపడిన ప్రభుత్వం.. ఆక్రమణలంటూ బస్తీలను ఆగం చేసిన హైడ్రా.. చెరువులను మింగి కట్టుకున్న పెద్దోళ్ల భవంతుల వైపు ఎందుకు అడుగులు వేయట్లేదో నమస్తే తెలంగాణ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నా.. నెలలతరబడి హైడ్రా ఎందుకు కదలలేదో నిగ్గదీసి అడిగింది. శిఖంలోకి దూరి మరీ కట్టుకున్న సౌధాల వివరాలను, ఆక్రమించిన ప్రముఖుల వివరాలు ఫొటోలు సహా ప్రచురించింది. మంత్రులు, ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించడం చర్చనీయాంశమైంది.
ఉద్యోగులు, పెన్షనర్ల పక్షాన..
ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని అక్షరీకరించింది నమస్తే తెలంగాణ. ఏలికలు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూనే.. చేతులెత్తేసిన వైనాన్ని కథనాలుగా మలచింది. పెండింగ్ డీఏలను ఇయ్యకుండా, పీఆర్సీ అమలుచేయకుండా సర్కార్ ఆడుతున్న దోబూచులాటను బట్టబయలు చేసింది. ఉద్యోగ విరమణ చేసి.. ఏండ్లు గడుస్తున్నా బెనిఫిట్స్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న తీరును ఎండగట్టింది. అంపశయ్యపై పెన్షన్ బాధితులు చేస్తున్న ఆక్రందనను వినిపించింది. భాగ్యనగర్ టీఎన్జీవోల స్థలాన్ని ప్రభుత్వపెద్దల అనుయాయులు ఆక్రమిస్తే.. బయటపెట్టడమేకాదు.. 168 రోజులుగా ఉద్యోగులు ఉద్యమిస్తున్న వార్తలనూ జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లింది. ఆర్టీసీ ఉద్యోగులకు చాపకింద నీరులా జరుగుతున్న అన్యాయాన్ని కార్మికలోకానికి ఎలుగెత్తి చాటింది.
గురుకుల గోసలను గుదిగుచ్చి..
ఎవరెస్టు అంతటి కీర్తిని గడించిన తెలంగాణ గురుకులాలను ప్రభుత్వం గాలికొదిలేసింది. రెండేండ్లలో ఫుడ్‌పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు సభ్యసమాజాన్ని నివ్వెరపరిచాయి. ప్రతిరోజూ ఎక్కడో దగ్గర విద్యార్థులు రోడ్డెక్కుతూనే ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నా.. సమస్యలు పరిష్కృతం కాలేదు. ఈ నిర్లక్ష్యాన్ని తూర్పారబడుతూ ఎప్పటికప్పుడు నమస్తే తెలంగాణ కథనాలను ప్రచురించింది. నిద్రమబ్బు పాలకులను తట్టి లేపింది.
దుబారాను తూర్పారబడుతూ..

ఖజానా ఖాళీ అని గగ్గోలు పెడుతూనే.. ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తున్న పాలకుల ద్వంద్వనీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టింది నమస్తే తెలంగాణ. ప్రభుత్వ హెలికాప్టర్‌ను మంత్రులు షేర్ఆటో కన్నా కడుహీనంగా వాడడాన్ని ప్రశ్నించింది. రాజకీయ వ్యవహారాల కోసం, అధిష్ఠానం చుట్టూ చక్కర్ల కోసం ప్రజాధనాన్ని గాల్లో కలుపుతూ సీఎం సాగిస్తున్న ఢిల్లీ టూర్ల బండారాన్ని బయటపెట్టింది. సెక్రటేరియట్లో వాస్తు మార్పులకు,తెలంగాణ సొమ్మును ఫుట్‌బాల్ మ్యాచుల పేరిట, ఇతరత్రా ఆటవిడుపు కార్యక్రమాలకు ధారపోయడాన్ని నిలదీసింది.
కరెంటు కష్టాలు.. వెలుగులోకి!
దాదాపు పదేండ్లు రెప్పపాటు కూడా కరెంటుపోని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ కష్టాలూ మొదలయ్యాయి. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు అధికారగణం తొండలు, బల్లులు అంటూ సాకులు చెప్పింది. మళ్లీ పల్లెల్లో చీకట్లో పొలాలకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. మూడోడిస్కమ్ పేరుతో సర్కార్ మరో మాయాపాచిక వేస్తున్నది. ఉచిత కరెంటును అటకెక్కించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలపక్షాన నిలువరించింది నమస్తే తెలంగాణ. సాగుకు స్మార్ట్ మీటర్లు పెట్టే దిశగా ప్రభుత్వ చర్యలను ఎండగట్టింది.
ఈ నగరానికి ఏమైంది?
విశ్వనగరస్థాయికి ఎదిగిన హైదరాబాద్ కీర్తికిరీటాన్ని రెండేండ్లలోనే పాతాళంలోకి పడదోసింది ప్రభుత్వం. ట్రాఫిక్ అస్తవ్యస్తం, అపారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి గోస, గుంతలమయమైన రోడ్లు, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్.. పెరిగిన నేరాలు.. భాగ్యనగర ప్రతిష్ఠను దిగజార్చాయి. వాటిపై ‘ఈ నగరానికి ఏమైంది?’ శీర్షికన వరుస కథనాలు వెలువరించింది. ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేసింది.
అవినీతిపై అక్షరాయుధం
ప్రభుత్వ విభాగాల్లో పెరిగిపోయిన అవినీతిపై కథనం కొనసాగించింది నమస్తే తెలంగాణ. గాంధీ దవాఖాన నుంచి ఎన్ఎంజేదాకా.. ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అంగన్వాడీల వరకు.. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ మైనింగ్.. వాట్ నాట్? జడలు విప్పిన అవినీతిని సజీవ సాక్ష్యంగా పత్రిక ద్వారా ప్రజలముందు ఉంచింది. చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కానిస్టేబుళ్ల పక్షాన నిలదీసిన కలం

హోంగార్డులకు కారుణ్యనియామకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా కారుణ్యనియామకాలనే రద్దు చేస్తూ రహస్య జీవో విడుదల చేసింది. దీంతో వారు ఆగ్రహోదగ్రులయ్యారు. ప్రభుత్వ తీరుపై రోడ్డెక్కారు. హైదరాబాద్‌ను ముట్టడించారు. మరోవైపు బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలూ రోడ్డెక్కాయి. మితిమీరిన పనిభారం, కుటుంబాలకు దూరంగా అవిశ్రాంతంగా 15-20 రోజులు పనిచేయించడంపై ఆ కుటుంబాలు భగ్గుమన్నాయి. భార్యాపిల్లలు రహదారులపైకి వచ్చారు. వారందరికీ మద్దతుగా నిలిచింది నమస్తే తెలంగాణ. వారి సమస్యలను ప్రముఖంగా ప్రస్తావించింది. వరుస కథనాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. చివరికి ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితిని కల్పించింది. పోలీసుల ఆరోగ్యభద్రత, ఆత్మహత్యలపైనా నమస్తే తెలంగాణ గొంతెత్తింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలముందుంచింది.
అప్పులపై…కేసీఆర్ ప్రభుత్వంపై అభాండాలు వేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అప్పుల్లో తనదైన దూకుడును ప్రదర్శించింది. ఒక్క ప్రాజెక్టు కట్టకుండానే, ఒక భారీ నిర్మాణం చేపట్టకుండానే రెండేండ్లలో సుమారు 2.8 లక్షల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దింది. దీనిపై ఎప్పటికప్పుడు వాస్తవాలను గణాంకాలు సహా ప్రజల ముందుంచింది నమస్తే తెలంగాణ.
చార్జీల బాదుడుపై కలం విదిల్చి..
ఒకవైపు ఫ్రీబస్ అంటూనే మరోవైపు ప్రయాణికులపై చార్జీల భారాన్ని మోపింది ప్రభుత్వం. 25శాతం వరకు ఆర్టీసీ చార్జీలను పెంచింది. గ్రీన్‌సెస్ కింద మరో రూ.10 వరకు ప్రయాణికుడి జేబుకు చిల్లుపెట్టింది. హైదరాబాద్‌లో అయితే ఇటీవల సగటున 10 నుంచి 15 రూపాయల వరకు చార్జీలను ఆర్టీసీ పెంచింది. ఇక పండుగల పూట స్పెషల్బాదుడు అదనం. మెట్రో రైలు చార్జీలనూ పెంచి కామన్మ్యాన్పై రవాణాభారాన్ని మోపింది. జనసామాన్యంపై చార్జీల బాదుడును వరుస కథనాలతో ప్రశ్నించింది నమస్తే తెలంగాణ.