Onion Price | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): నిత్యం వంటల్లో వాడే వెల్లులి, అల్లం, ఉల్లి ధరలు ఉట్టెక్కి కూర్చున్నాయి. వెల్లుల్లి ధరలు నాలుగింతలు పెరగగా, అల్లం, ఉల్లి ధరలు రెట్టింపయ్యాయి. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి ధర రూ.100 పలికింది. ప్రస్తుతం హోల్‌సెల్ మార్కెట్లోనే కిలో రూ.300 నుంచి రూ.400కు చేరింది. రిటైల్ మార్కెట్లో మాత్రం కిలో వెల్లుల్లి ధర రూ.350 పలుకుతుండగా, బయట మాత్రం రూ.400 పైనే ఉన్నది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన హోల్‌సేల్ మార్కెట్లయిన ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట మార్కెట్లకు వెల్లుల్లి సరఫరా తగ్గింది. తెలంగాణలోని కోహిర్ నుంచే పెద్ద ఎత్తున సరుకు వస్తుంది. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి కూడా కొంత వస్తుంది. నెల క్రితం మార్కెట్‌కు రోజుకు 30 నుంచి 50 లారీల వెల్లుల్లి దిగుమతి కాగా.. ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే వస్తున్నదని హైదరాబాద్ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగానే మార్కెట్లో వెల్లుల్లి ధర పెరిగినట్టు చెప్పారు. వెల్లుల్లి, ఉల్లిగడ్డ, అల్లం ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ప్రతి వంటకంలో వినియోగించే ఉల్లిగడ్డ ధర సామాన్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని హోల్‌సేల్ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిగడ్డ రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు పలుకుతుంది. రిటైల్ వ్యాపారులు మాత్రం కిలో ఉల్లిగడ్డ రూ.50 నుంచి రూ.60కి అమ్ముతున్నారు. గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ దిగుమతి తగ్గడం వల్ల ధర పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరులో కొత్త పంట మార్కెట్‌కు వస్తుందని, ధర తగ్గే అవకాశం ఉన్నదని సికింద్రాబాద్ హోల్‌సేల్ గ్రెయిన్ మర్చంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రలోని నాసిక్, పుణె ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. దీంతో ఉల్లి, వెల్లుల్లి దిగుబడి భారీగా పడిపోయింది. ఇటీవల పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో అల్లం దిగుబడి తగ్గినట్టు వ్యాపారులు చెప్తున్నారు.