హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పీఆర్సీ కమిటీ.. ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థలు, గ్రంథాలయ సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ సూచనలు, వినతులు, ప్రతిపాదనలను మార్చి 4వ తేదీలోగా సమర్పించవచ్చని పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ సూచించారు.
ప్రతిపాదనలను రాతపూర్వకంగా, వ్యక్తిగతంగా, పోస్టు ద్వారా లేదా TSPRC.02.2023@gmail.com మెయిల్ ఐడీకి ఈ మెయిల్ చేయవచ్చని తెలిపారు. ఇంక్రిమెంట్, డీఏ, ఇంటి అద్దె భత్యం, సిటీ కాంపెన్సెటరీ అలవెన్స్, ఇతర అలవెన్సులు, ప్రత్యేక చెల్లింపులు, ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం, పెన్షనరీ ప్రయోజనాలపై సంఘాలు ప్రతిపాదనలివ్వాలని సూచించారు. పాత పీఆర్సీ గడువు పూర్తికావడంతో 2023 జూలై 1 నుంచి వర్తింపజేసేలా నూతన పీఆర్సీ అమలుకు కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.